గౌహతి వన్డే మ్యాచ్ హైలెట్స్ : తొలి ఆటగాడు విరాట్ కోహ్లీ...
సోమవారం, 22 అక్టోబరు 2018 (10:35 IST)
పర్యాటక వెస్టిండీస్ జట్టుతో గౌహతి వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు 8 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేస్తే.. భారత్ కేవలం 42.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసి సరికొత్త రికార్డును నెలకొల్పింది.
ఈ మ్యాచ్‌లో కరేబియన్ ఆటగాళ్ల ధాటికి స్కోరు బోర్డు పరుగెత్తింది. ఫలితంగా 322 పరుగులు చేశారు. అంత పెద్ద లక్ష్యం.. భారత బ్యాట్స్‌మెన్ వీర కుమ్ముడు ముందు మరీ చిన్నబోయింది. కరేబియన్ జట్టు నుంచి ఒకరు సెంచరీ కొడితే.. మన నుంచి ఇద్దరు బాదేశారు. రోహిత్ (152 నాటౌట్), కోహ్లీ (140)ల శతకాల మోతతో తొలివన్డేలో విండీస్ లక్ష్యాన్ని టీమ్ ఇండియా 42.1 ఓవర్లలోనే ఊదేసింది. తద్వారా 5 వన్డేల సిరీస్‌లో ఘనంగా బోణీ కొట్టింది. ఈ మ్యాచ్ హైలెట్స్‌ను ఓ సారిపరిశీలిస్తే...
* ర్యాంకుల్లో నెంబర్‌వన్ బ్యాట్స్‌మన్ కోహ్లీ తన స్థాయి ఆటతీరుతో మరో అరుదైన రికార్డు సాధించాడు. అత్యంత వేగంగా 60 అంతర్జాతీయ శతకాలు బాదిన తొలి ఆటగాడిగా నిలిచాడు. 386 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ.. సచిన్‌కన్నా 40 ఇన్నింగ్స్‌లు తక్కువ ఆడి ఈ ఘనత సాధించాడు.
* వన్డేల్లో 36, టెస్టుల్లో 24 శతకాలతో ఉన్న ఈ స్టార్ బ్యాట్స్‌మన్ ఓవరాల్‌గా 60 అంతకన్నా ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాళ్లలో ఐదో స్థానంలో నిలిచాడు. సచిన్ (100), పాంటింగ్ (71), సంగక్కర (63), కలిస్ (62) ముందున్నారు.
* 300+ రన్స్ ఛేదనలో అత్యధిక సెంచరీలు (8) చేసిన తొలి ఆటగాడు కోహ్లీ. అలాగే వరుసగా మూడు కేలండర్ ఇయర్స్ (20016-18)లో 2000కు పైగా పరుగులు సాధించిన ఆటగాడిగానూ సచిన్, హేడెన్, రూట్ సరసన విరాట్ నిలిచాడు.
* వన్డేల్లో అత్యధికంగా 150+ పరుగులు సాధించిన ఆటగాడిగా సచిన్ (5)ను దాటిన రోహిత్ (6 సార్లు).
* ఛేదనలో రెండో వికెట్‌కు అత్యధిక పరుగుల (246) భాగస్వామ్యాన్ని నమోదు చేసిన తొలి భారత జోడీ రోహిత్ - కోహ్లీ. ఓవరాల్‌గా ఛేదనలో ఇది రెండో అత్యధికం. ఈ జాబితాలో వాట్సన్, పాంటింగ్ (252) ముందున్నారు.
* వెస్టిండీస్‌తో వన్డేల్లో అత్యధిక పరుగులిచ్చిన (81) భారత బౌలర్ షమి. ఈ జాబితాలో జడేజా (80)ను షమి అధిగమించాడు.
* విండీస్ తరపున తక్కువ ఇన్నింగ్స్ (13)లో మూడు సెంచరీలు సాధించిన ఆటగాడిగా రిచర్డ్స్ (16)ను హెట్‌మయెర్ అధిగమించాడు.
* కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు (14) చేసిన వారిలో పాంటింగ్ (22) తర్వాత నిలిచిన కోహ్లీ. ఛేదనలో అతడికిది 22వ శతకం కాగా స్వదేశంలో 15వది.
* విండీస్‌పై అత్యధిక వ్యక్తిగత పరుగులు (152) నమోదు చేసిన రెండో భారత ఆటగాడు రోహిత్. సెహ్వాగ్ (219) ముందున్నాడు.
* వన్డేల్లో అత్యధిక సెంచరీల (15) భాగస్వామ్యాలు ఏర్పరచిన ఆటగాళ్లలో కోహ్లీ, రోహిత్ సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచారు. తొలి స్థానంలో సచిన్, గంగూలీ (26సార్లు) ఉన్నారు.
* రోహిత్‌కు ఇది వన్డేల్లో 20వ సెంచరీ. వెస్టిండీస్‌పై అతనికిదే తొలి శతకం.