రిషబ్ పంత్ అంతటి వాడవుతాడా? ధోనీ ట్రైనింగ్.. కుంబ్లే ప్రతిపాదన.. ఫిటినెస్‌ లేని ప్లేయర్లు?

శనివారం, 24 జూన్ 2017 (15:09 IST)
బీసీసీఐకి-టీమిండియాల మధ్య కోచ్ వ్యవహారం నడుస్తున్న నేపథ్యంలో.. టీమిండియా స్టార్ ప్లేయర్, కూల్ కెప్టెన్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కోచ్‌గా మారిపోయాడు. ఇదేదో టీమిండియా జట్టుకు ధోనీని నియమించారేమోనని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ప్రస్తుతం టీమిండియా విండీస్‌తో తొలి వన్డే మ్యాచ్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన ప్రాక్టీసులో ధోనీ కోచ్‌లా మారి.. కొత్త కుర్రాడికి ట్రైనింగ్ ఇచ్చాడు. 
 
వెస్టిండీస్ టూర్ కోసం యువ వికెట్ కీప‌ర్ రిష‌బ్‌ పంత్‌ను సెలెక్ట‌ర్లు ఎంపిక చేశారు. ఆ కొత్త కుర్రాడు ధోనీ త‌ర్వాత మహేంద్రుడంతటి వాడు కావాలని సెలెక్టర్లు కోరుకుంటున్నారు. ప్రస్తుతం టీమిండియా ప్రధాన కోచ్ లేకుండానే ఆడుతోంది. వికెట్ కీప‌ర్‌గా ధోనీకి ఎంతగానో అనుభ‌వం ఉంది. అందుకే ధోనీ ఆ కొత్త కుర్రాడికి మెల‌కువ‌లు నేర్పించాడు. రిషబ్‌కు ట్రైనింగ్ ఇస్తున్న సందర్భంలో ధోనీని చక్కగా తీసిన ఫోటో, వీడియోలను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐపీఎల్‌లో ధోనీలా మెరిసిన రిషబ్ అంతర్జాతీయ వేదికలపైన కూడా మెరుగ్గా ఆకట్టుకోవాలనే దిశగా మహేంద్ర సింగ్ అతనికి టిప్స్ ఇచ్చాడు. 
 
ఇదిలా ఉంటే.. టీమిండియా కోచ్ పదవి నుంచి ఇప్పటికే తప్పుకున్న మాజీ కోచ్ అనిల్ కుంబ్లే.. రాజీనామాకు ముందు కొన్ని ప్రతిపాదనలు చేశాడు. కోచింగ్ ఉద్యోగులకు ఇచ్చే వేతనాన్ని పెంచాల్సిన అవసరం ఉందని కుంబ్లే పేర్కొన్నాడు. జట్టు కెప్టెన్ సంపాదిస్తున్న మొత్తంలో కనీసం 60 శాతమైనా చీఫ్ కోచ్‌కు చెల్లించాలని డిమాండ్ చేశాడు. జాతీయ స్థాయి కోచ్‌లకు కూడా దీన్ని వర్తింపజేయాలని కోరాడు. ఫిట్‌నెస్ లేని ప్లేయర్లు తమ వేతనంలో కొంత మేర కోల్పోవాల్సి వుంటుందనే రీతిలో కుంబ్లే బీసీసీఐ సమర్పించిన ప్రతిపాదనలో పేర్కొన్నాడు. 

వెబ్దునియా పై చదవండి