ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా క్రికెటర్లు అడుగుపెట్టనున్నారు. ఇంగ్లాండ్ టూర్ ముంగిట టీమిండియా బయో- సెక్యూర్ బబుల్‌లోకి భారత క్రికెటర్లు ఎంటరయ్యారు. ఇంగ్లాండ్ టూర్‌కి ఎంపికైన భారత క్రికెటర్లు ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేయించుకున్నారు. సెకండ్ డోస్ మాత్రం ఇంగ్లాండ్ గడ్డపై క్రికెటర్లు వేయించుకోనున్నట్లు బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో జూన్ 2న ఇంగ్లాండ్ గడ్డపైకి వెళ్లనున్న కోహ్లీ కెప్టెన్సీలోని భారత టెస్టు జట్టు.. అక్కడ సౌథాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జూన్ 18 నుంచి 23 వరకూ ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో తలపడి.. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకూ ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో ఢీకొట్టబోతోంది. ఈ మేరకు 20 మందితో కూడిన జట్టుని భారత సెలెక్టర్లు ప్రకటించారు.
భారత టెస్టు జట్టులోకి ఎంపికైన ఆటగాళ్లు ముంబయికి చేరుకున్నారు. ఈ మేరకు కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్న ఆటగాళ్లు.. హోటల్‌లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఏర్పాటు చేసిన బయో- సెక్యూర్ బబుల్‌లోకి ఎంటరయ్యారు. ఏడు రోజుల పాటు ఆటగాళ్లు గదికే పరిమితం కానుండగా.. అందులో వారికి అవసరమైన సౌకర్యాల్ని ఏర్పాటు చేసినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.