ఐపీఎల్ 2021: చెన్నై సూపర్ కింగ్స్ బోణీ.. చాహర్‌ (4/13) అదుర్స్

శనివారం, 17 ఏప్రియల్ 2021 (08:00 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బోణి కొట్టింది. పంజాబ్‌ కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పేసర్‌ దీపక్‌ చాహర్‌ (4/13) పవర్‌ప్లేలో నిప్పులు చెరిగే బంతులు వేయటంతో పంజాబ్‌ కింగ్స్‌ పనైపోయింది. స్వింగ్‌ బౌలర్‌ దీపక్‌ చాహర్‌ (4/13) అద్వితీయ ప్రదర్శనతో చెలరేగిన వేళ.. పంజాబ్‌ కింగ్స్‌ 107/8 పరుగులకే పరిమితమైంది. పంజాబ్‌ కింగ్స్‌పై విజయంతో సీజన్లో సూపర్‌కింగ్స్‌ తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 
 
26/5తో కష్టాల్లో పడిన పంజాబ్‌ను షారుక్‌ ఖాన్‌ (47, 36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆదుకున్నాడు. స్వల్ప ఛేదనలో మోయిన్‌ అలీ (46, 31 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) చెలరేగాడు. ఓపెనర్‌ డుప్లెసిస్‌ (36 నాటౌట్‌, 33 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఛేదనలో బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. పంజాబ్‌ పేసర్‌ మహ్మద్‌ షమి రెండు వికెట్లతో మెరిశాడు. అయినా పంజాబ్‌ను గెలుపు వరించలేదు. 
 
108 పరుగుల స్వల్ప ఛేదనలో చెన్నైకి ధనాధన్‌ ఆరంభం లభించలేదు. యువ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (16 బంతుల్లో 5) పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డాడు. మరో ఎండ్‌లో డుప్లెసిస్‌ సైతం నెమ్మదిగా ఆడటంతో ఆరంభ ఓవర్లలో చెన్నై పెద్దగా పరుగులు రాబట్టుకోలేదు. 
 
గైక్వాడ్‌ నిష్క్రమణతో సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌ స్వరూపమే మారిపోయింది. పించ్‌ హిట్టర్‌ మోయిన్‌ అలీ ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో కదంతొక్కాడు. ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో చెన్నైకి గెలుపు గీతకు చేరువ చేశాడు. సురేశ్‌ రైనా (8), రాయుడు (0)లు వరుస బంతుల్లో నిష్క్రమించినా శామ్‌ కరన్‌ తోడుగా ఓపెనర్‌ డుప్లెసిస్‌ లాంఛనం ముగించాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు