భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ మధ్య మనస్పర్థలు కొనసాగుతున్నాయి. ఇవి మరోమారు తాజాగా వెలుగు బయటపడ్డాయి. తన కెప్టెన్సీ పోవడానికి గంగూలీనే కారణమనే బలమైన అభిప్రాయంలో విరాట్ కోహ్లీ ఉన్నారు. ఫలితంగా శనివారం రాత్రి ఢిల్లీ మ్యాచ్ అనంతరం సౌరవ్ గంగూలీతో చేతులు కలిపేందుకు ససేమిరా అన్నారు.
నిజానికి గత 2021 నుంచి గంగూలీ - కోహ్లీ మధ్య విభేదాలు మొదలయ్యాయి. అపుడు భారత జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. బీసీసీఐ చీఫ్‌గా గంగూలీ ఉన్నారు. అపుడే కోహ్లీ టీ20 కెప్టెన్సీని వదులుకున్నారు. దీనిపై గంగూలీ స్పందిస్తూ, కెప్టెన్‌గా కొనసాగాలని కోహ్లీని కోరినప్పటికీ ఆయన నిరాకరించినట్టు చెప్పాడు. ఈ వ్యాఖ్యలను కోహ్లీ ఖండించారు. ఆ తర్వాత కోహ్లీని వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి కూడా తొలగించారు. సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత గత యేడాది జనవరిలో టెస్టు కెప్టెన్సీని కూడా కోహ్లీ వదులుకున్నాడు.
ఇదిలావుంటే, గత రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు - ఢిల్లీ కేపిటల్స్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. బెంగుళూరులో జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగుళూరు 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా మాజీ సారథి అయిన గంగూలీ ప్రస్తుతం ఢిల్లీ కెపిటల్స్ డైరెక్టరుగా ఉన్నారు. కోహ్లీ బెంగుళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మ్యాచ్ తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు, సిబ్బంది పరస్పరం కరచాలనం చేసుకుంటున్న సమయంలో గంగూలీ, కోహ్లీ తారసపడ్డారు.
అయితే, గంగూలీతో చేతులు కలిపేందుకు కోహ్లీ ఇష్టపడలేదు. దీంతో అతడి పక్కనే ఉన్న డుప్లెసిస్‌తో గంగూలీ చేతులు కలిపాడు. అది చూసిన పాంటింగ్.. గంగూలీతో చేతులు కలపాలని కోహ్లీకి చెప్పినప్పటికీ మరోమారు నిరాకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.