నోటి దూల వ్యాఖ్యల క్రికెటర్లకు భారీ అపరాధంతో వాత!

శనివారం, 20 ఏప్రియల్ 2019 (17:40 IST)
ఇటీవల భారత క్రికెట్ జట్టుకు చెందిన ఇద్దరు యువ క్రికెటర్లు నోటిదూలను ప్రదర్శించారు. వారికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అంబుడ్స్‌మెన్ భారీ అపరాధం విధించి వాత పెట్టింది. 
 
ప్రముఖ టీవీ చానెల్‌లో 'కాఫీ విత్ కరణ్' అనే కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో భారత యువ క్రికెటర్లు కేఎల్ రాహుల్‌, హార్ధిక్ పాండ్యాల‌ు పాల్గొన్నారు. అపుడు హోస్ట్ అడిగిన ప్రశ్నలకు వారిద్దరూ సమాధానమిస్తూ మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. ఇవి పెద్ద వివాదాస్పదం కావడంతో వారిద్దరిపై బీసీసీఐ ఒకటి రెండు మ్యాచ్‌ల నిషేధం కూడా విధించింది. 
 
ఈ నేపథ్యంలో దీనిపై విచారణ జరిపిన బీసీసీఐ అంబుడ్స్‌మ‌న్ డీఎకే జైన్ జరిమానా విధించారు. ఆ ఇద్ద‌రు ప్లేయ‌ర్ల‌కు ఒక్కొక్క‌రికి రూ.20 ల‌క్ష‌ల జ‌రిమానా విధించారు. ఈ నిధులను విధుల్లో ప్రాణాలు కోల్పోయిన 10 మంది పారామిలిట‌రీ కానిస్టేబుళ్ల భార్య‌ల‌కు చెరొక‌రు ఒక్కొక్క ల‌క్ష చొప్పున ఇవ్వాల‌ని అంబుడ్స్‌మ‌న్ ఆదేశించారు. 
 
అలాగే బ్లైండ్ క్రికెట్ సంఘానికి కూడా ఇద్ద‌రూ చెరో రూ.10 ల‌క్ష‌లు డిపాజిట్ చేయాల‌ని ఆదేశించారు. ఆదేశించిన నాలుగు వారాల్లోగా జ‌రిమానా మొత్తాన్ని చెల్లించ‌కుంటే.. ఆ ప్లేయ‌ర్ల మ్యాచ్ ఫీజు నుంచి బీసీసీఐ ఆ సొమ్మును రాబట్టుకోవాలని ఆదేశించారు. ఈ దేశంలో క్రికెట‌ర్ల‌ను రోల్‌మోడ‌ల్‌గా చూస్తార‌ని, అలాంటి వాళ్లు అంతే హుందాగా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంద‌ని సలహా ఇచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు