ఏపీలోని నెల్లూరు జిల్లాలో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోయారు. ఏకంగా పోలీసుల వాహనాన్ని ఢీకొట్టి వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. దీంతో స్మగ్లర్లపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న పక్కా సమాచారంతో ఆదివారం తెల్లవారుజామున నగరంలోని ఎస్వీజీఎస్ కళాశాల వద్ద జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో రాజమండ్రికి చెందిన బీకర ప్రకాష్ అలియాస్ సూర్యప్రకాష్ కారులో గంజాయి తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్మగ్లర్ వాహనంతో వేగంగా పోలీసులను ఢీకొట్టి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. ఈ దాడిలో ఓ కానిస్టేబుల్‌కు గాయాలవ్వడంతో ఆత్మరక్షణ కోసం బాలాజీనగర్ సీఐ సాంబశివరావు రెండు రౌండ్లు కాల్పులు జరిపి స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
కారులో ఉన్న 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సమాచారం అందుకున్న ఈగల్ సెల్ ఐజీ రవి కృష్ణ, ఎస్పీ కృష్ణకాంత్‌లు ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ ఫిరోజ్‌ను పరామర్శించారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడినా, అమ్మకాలు సాగించినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఐజీ, ఎస్పీలు హెచ్చరించారు.