హర్యానా హరికేన్‌కు గుండెపోటు.. ఆంజియోప్లాస్టీ నిర్వహించిన వైద్యులు

శుక్రవారం, 23 అక్టోబరు 2020 (16:03 IST)
క్రికెట్ ప్రపంచంలో భారత క్రికెట్‌కు ఓ గుర్తింపు తెచ్చిన హర్యానా హరికేన్ కపిల్ దేవ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు తాజాగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆ పిమ్మట పరీలించిన వైద్యులు... ఆయనకు ఆంజియోప్లాస్టీ నిర్వహించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఇపుడు ఆయన ఢిల్లీలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఉంటున్నారు. 
 
61 ఏళ్ల కపిల్ దేవ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని, భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. మరోవైపు కపిల్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రార్థిస్తున్నారు. కాగా, ఈ హర్యానా హరికేన్... తన క్రికెట్ కెరీర్‌లో మొత్తం 131 టెస్టులు, 225 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 5,248 పరుగులు, వన్డేల్లో 3,783 పరుగులు సాధించారు. 
 
ప్రపంచంలో టెస్ట్ కెరీర్లో 400 వికెట్లు సాధించిన తొలి బౌలర్ గా కపిల్ రికార్డు పుటల్లోకి ఎక్కారు. తన కెరీల్లో టెస్టుల్లో 434 వికెట్లు, వన్డేల్లో 253 వికెట్లను కపిల్ పడగొట్టారు. 1983 ప్రపంచ కప్‌లో జింబాబ్వేపై 138 బంతుల్లో 175 పరుగులు (నాటౌట్) చేసి క్రికెట్ ప్రపంచాన్ని అబ్బుర పరిచారు. కెప్టెన్‌గా ఇండియాకు ప్రపంచకప్‌ను అందించారు. దీంతో భారత్ క్రికెట్ జట్టు దశ తిరిగిపోయిందని చెప్పొచ్చు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు