దక్షిణాఫ్రికాతో జోహెన్స్‌బర్గ్‌లో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత బ్యాట్స్‌మెన్లు అదరగొడుతున్నారు. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ రోహిత్ శర్మ 13 బంతుల్లో ఐదు పరుగులకే అవుట్ అయ్యాడు. రబాడ బౌలింగ్‌లో రోహిత్ శర్మ పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ మాత్రం సెంచరీ బాదాడు. సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
శిఖర్ ధావన్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ చక్కని భాగస్వామ్యం ఇచ్చాడు. అంతేగాకుండా కొత్త రికార్డును కూడా సృష్టించాడు. పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ అర్థ సెంచరీని పూర్తి చేయడం ద్వారా దక్షిణాఫ్రికాతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో 350 పరుగులకి పైగా సాధించిన రెండో కెప్టెన్‌గా కోహ్లీ ఘనత సాధించాడు. అలాగే ఈ వన్డేలో మరో రికార్డు కూడా నమోదైంది.
రెండో వికెట్‌కు కోహ్లీ-ధవాన్ కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పటం ఇది ఎనిమిదోసారి. అయితే ధీటుగా ఆడిన శిఖర్ ధావన్ శతకంతో భారత స్కోరును పరుగులెత్తించాడు. 99 బంతుల్లో పది ఫోర్లు, రెండు సిక్సర్లతో వంద పరుగులు సాధించాడు. తద్వారా తన వన్డే కెరీర్‌లో 13వ శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక విరాట్ కోహ్లీ కూడా సెంచరీ దిశగా బ్యాటింగ్ చేశాడు. అయితే విరాట్ కోహ్లీ మాత్రం సెంచరీని చేజార్చుకున్నాడు.
సెంచరీ దిశగా బ్యాటింగ్ చేసిన కోహ్లీ 83 బంతులాడి ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 75 పరుగులు సాధించాడు. మోరిస్ బౌలింగ్‌లో మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చి కోహ్లీ అవుట్ అయ్యాడు. దీంతో 34.2 ఓవర్లలో భారత్ రెండు వికెట్ల నష్టానికి 200 పరుగులు సాధించింది. ప్రస్తుతం ధావన్ (107), రహానే (5) క్రీజులో వున్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడ, మోరిస్ చెరో వికెట్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు.