ఏటీఎంలోని నగదు వాడేశాడు.. నేరం బయటపడకుండా ఉండేందుకు...

ఠాగూర్

శుక్రవారం, 8 ఆగస్టు 2025 (14:07 IST)
ఏటీఎం కేంద్రంలోని నగదును తన సొంతానికి వాడుకున్నాడు. ఈ నేరం బయటపడుకుండా ఉండేందుకు ఏకంగా ఏటీఎంనే తగలబెట్టేశాడు. ఆ తర్వాత అగ్నిప్రమాదంగా చిత్రీకరించాడు. అయితే పోలీసుల విచారణలో మాత్రం అసలు నిజం వెల్లడైంది. దీంతో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యానాం కొత్తబస్టాండ్ సమీపంలోని ఎస్బీఐ ఏటీఎం కేంద్రం జులై 8న తెల్లవారుజామున మంటల్లో చిక్కుకుని కాలిబూడిదైంది. తొలుత ఇది ప్రమాదంగా భావించారు. అనంతరం పోలీసుల విచారణలో కుట్ర కోణం బయటపడింది. ఏటీఎంలో నగదు నింపే ఇద్దరు సిబ్బంది పెట్రోల్ పోసి నిప్పు అంటించినట్లు గుర్తించారు. నాగాబత్తుల వెంకటేశ్ అలియాస్ బిట్టూ, వనమూరు అనిల్ బాబు రెండేళ్లుగా ఏటీఎంలలో నగదు నింపే విధుల్లో ఉన్నారు.
 
వీరు విడతల వారీగా రూ.12 లక్షలు స్వాహా చేశారు. సరైన ఆడిటింగ్ లేకపోవడంతో అధికారులు గుర్తించలేదు. ఈ వ్యవహారం ఎప్పటికైనా బయటపడుతుందని భావించిన ఆ నిందితులు.. ఆ రోజు ఉదయం నాలుగున్నర తర్వాత ఏటీఎం కేంద్రంలో 10 లీటర్ల పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ఆ క్రమంలో ప్రధాన నిందితుడు బిట్టూ రెండు కాళ్లకూ మంటలు అంటుకోగా, పరుగెత్తుకుంటూ వెళ్లి సమీపంలోని కారెక్కి పారిపోయిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. దాని ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు