ఆసియా కప్ : నేడు హైఓల్టేజ్ సంగ్రామం.. ఇండోపాక్ మ్యాచ్

ఆదివారం, 28 ఆగస్టు 2022 (09:13 IST)
దుబాయ్ (యూఏఈ) వేదికగా ఆసియా కప్ క్రికెట్ టోర్నీ మొదలైంది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో అనూహ్య ఫలితం వచ్చింది. క్రికెట్ పసికూన ఆప్ఘనిస్థాన్ చేతిలో శ్రీలంక జట్టు చిత్తుగా ఓడిపోయింది. ఇక రెండో మ్యాచ్‌ ఆదివారం రాత్రి 7.30 గంటలకు జరుగనుంది. ఇందులో చిరకాల ప్రత్యర్థులు, దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్‌లు తలపడతాయి. ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌ కోసం ఇరు జట్లూ సర్వసన్నద్ధంగా తయారయ్యాయి. వాస్తవానికి ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు మాత్రం స్నేహపూరిత వాతావరణంలోనే ఉంటున్నారు. 
 
కానీ, ఇరు దేశాల క్రికెట్ అభిమానులు, సాధారణ ప్రజలు మాత్రం ఇండోపాక్ మ్యాచ్‌ను ఓ మహా సంగ్రామంగా పరిగణిస్తారు. అందుకే ఈ రెండు దేశాల క్రికెట జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు అత్యంత ఆదరణ ఉంటుంది. మైదానంలో ఒత్తిడిని అధికమించి రాణించే జట్టు విజయతీరానికి చేరనుంది. అలాంటి మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 
 
భారత కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఇపుడు కొత్త తరహా ఆటతీరును ప్రదర్శిస్తుంది. మైదానంలో బరిలోకి దిగిన తర్వాత తొలి బంతి నుంచే ఎదురు దాడికి దిగుతోంది. దీంతో ప్రత్యర్థి బౌలర్లను ఒత్తిడికి గురిచేస్తుంది. ఇపుడు పాకిస్థాన్‌పైనా అదే వ్యూహాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. పది నెలల క్రితం ఇదే దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో భారత్ చిత్తుగా ఓడిపోయింది. ఇపుడు దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా ఆటగాళ్లు గట్టిగా భావిస్తున్నారు. 
 
ఇక పాకిస్థాన్ జట్టు కెప్టెన్ బాబర్ అజమ్ ఆ జట్టుకు బలం. ఈయన భీకర ఫామ్‌లో ఉండటం భారత్‌కు ఆందోళనకలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. అలాగే మరో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. వీరిద్దరి ఓపెనింగ్ భాగస్వామ్యం జట్టుకు ఎన్నో విజయాలను అందించాయి. తొలి ముగ్గురు ఆటగాళ్లు మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ మిగిలిన ఆటగాళ్లు ఫామ్‌లో లేకపోవడం ఆ జట్టుకు ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. 
 
తుది జట్ల అంచనా..
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య, జడేజా, అశ్విన్, భువనేశ్వర్, అర్ష్‌దీప్ సింగ్, యజ్వేంద్ర చాహల్. 
 
పాకిస్థాన్ : బాబర్ అజమ్ (కెప్టెన్), రిజ్వాన్, ఫఖర్ జమాన్, ఇప్తికార్ అహ్మద్, హైదర్ అలీ, ఖుష్దల్ షా, షాదాబ్ ఖాన్, నవాజ్, హస్నైన్, హరీస్ రౌఫ్, దహానీ

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు