అదానీ గ్రూపుకు అప్పుల బాధ.. రూ.1.7లక్షల కోట్ల అప్పులు..
బుధవారం, 24 ఆగస్టు 2022 (11:04 IST)
దేశీయ కుబేరుడు గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ అప్పుల ఊబిలో చిక్కుకుంది. నికరంగా రూ.1.7లక్షల కోట్ల అప్పుల్లో అదానీ గ్రూప్ ఇబ్బంది పడుతోంది. ఈ విషయాన్ని ఫిచ్‌గ్రూప్‌నకు చెందిన క్రెడిట్‌సైట్స్ నివేదిక తెలిపింది. స్థూల రుణాలు రూ.2.3 లక్షల కోట్లకు పైగా, నికరంగా రూ.1.7 లక్షల కోట్ల అప్పులు వున్నట్లు క్రెడిట్ సైట్స్ వెల్లడించాయి.
ప్రస్తుత వ్యాపారాలతో పాటు కొత్తగా పెట్టనున్న వాటికీ పెట్టుబడుల కోసం రుణాలనే అధికంగా వినియోగిస్తుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. 'అదానీ గ్రూప్: డీప్లీ ఓవర్‌లివరేజ్డ్' పేరిట రూపొందించిన నివేదికలో ఈ విషయాలను పేర్కొంది.
1980ల్లో కమొడిటీ ట్రేడరుగా వ్యాపారాన్ని ప్రారంభించిన అదానీ నేతృత్వంలోని గ్రూప్ ఇపుడు గనులు, పోర్టులు, విద్యుత్ ప్లాంట్లు, విమానాశ్రయాలు, డేటా సెంటర్లు, రక్షణ రంగం వరకు విస్తరించింది.
తాజాగా 10.5 బిలియన్ డాలర్లతో హోల్సిమ్‌కు చెందిన భారత యూనిట్లను కొనుగోలు చేసి సిమెంట్ తయారీ రంగంలో ఒక్కసారిగా రెండోస్థానానికి చేరాలనుకుంటోంది. ఈ లావాదేవీలకు చాలావరకు రుణాల ద్వారానే నిధులు సమీకరించింది.
గత కొన్నేళ్లుగా అదానీ గ్రూప్ విస్తరణ ప్రణాళికల్లో దూకుడు ప్రదర్శిస్తోంది. ఇందువల్ల కంపెనీ రుణ పరమితులు, నగదు ప్రవాహాలపై ఒత్తిడి అధికమవుతోంది. అదానీ గ్రూప్ ప్రస్తుత వ్యాపారాలతో సంబంధం లేని కొత్త వ్యాపారాల్లోకి విస్తరిస్తోంది. ఇందు కోసం భారీ మూలధనం అవసరమవుతోంది. ఇది ఆందోళన కలిగిస్తోంది.
2021-22 చివరకు అదానీ గ్రూప్‌నకు చెందిన 6 నమోదిత కంపెనీల స్థూల రుణాలు రూ.2,30,900 కోట్లుగా ఉన్నాయి. నగదు నిల్వలను లెక్కవేశాక నికర రుణాలు రూ.1,72,900 కోట్లుగా తేలాయి.