అంతర్జాతీయ క్రికెట్‌కు ఆస్ట్రేలియా క్రికెటర్ పేస్ బౌలర్ మిచెల్ జాన్సన్ గుడ్‌బై చెప్పేశాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. మూడేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ ఆసీస్ ప్లేయర్ ఇప్పటివరకు కొన్ని దేశవాళి టీ20 లీగ్‌ల్లో ఆడుతూ వచ్చాడు. ఈ క్రమంలో ఇకపై టీ20 లీగ్‌ల్లో సైతం ఆడబోనని స్పష్టం చేశారు.
ఇదే అంశంపై జాన్సన్ స్పందిస్తూ, 'ఇక నా క్రికెట్ కెరీర్ అయిపోయింది. నేను నా చివరి బంతి వేసాను. చివరి వికెట్‌ను కూడా తీసుకున్నాను. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ఈ రోజు (ఆదివారం) ప్రకటిస్తున్నా. నేనింకా కొన్ని రోజులు ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 లీగ్‌ల్లో ఆడుతానని భావించాను. కానీ నాశరీరం అందుకు సహకరించడం లేదు. పూర్తిగా అలసిపోయాను. ఈ యేడాది ఐపీఎల్‌లో నాకు కలిగిన వెన్ను నొప్పి ఆటను ముగించాలని నన్ను హెచ్చిరించింది. దీంతో నా క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నాను. మిగిలిన నా జీవితాన్ని ఆస్వాదిస్తాను' అని భావోద్వేగంతో చెప్పుకొచ్చాడు.
జాన్సన్ తన కెరీర్‌లో 73 టెస్టుల్లో 313, వన్డేల్లో 153 మ్యాచుల్లో 239, టీ20ల్లో 38 వికెట్లను జాన్సన్ పడగొట్టాడు. ఆసీస్ తరపున 2007లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన జాన్సన్ 2015లో తన చివరి టెస్టు, వన్డేను ఆడాడు. కాగా, ఈ ఆసీస్ ప్లేయర్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే.