భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ధరించిన డ్రెస్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మిథాలీ.. నీకు మతిపోయిందా? ఆ డ్రెస్ ఏంటి? అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. మిథాలీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఓ ఫొటోలో ఆమె వస్త్రధారణ సరిగా లేదంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ విమర్శిస్తున్నారు. ఆమె తీరును తప్పుబడుతున్నారు. అయితే ఆమెను విమర్శించిన వారికి అంతే స్థాయిలో ఆమె ఫాలోవర్లు కౌంటరిస్తున్నారు. ఇలాంటి సంకుచిత మనస్తత్వాన్ని ఇకనైనా వీడాలంటూ పిలుపునిస్తున్నారు.
'నీ ఆలోచనను మార్చు.. దేశాన్ని మార్చు' అనే నినాదాన్ని వినిపిస్తున్నారు. మిథాలీ ఫొటోను వ్యతిరేకించిన వారి కంటే.. ఆమెకు మద్దతుగా నిలిచిన వారే ఎక్కువగా ఉండటం ఇక్కడ విశేషం. టీమిండియా మహిళా కెప్టెన్‌గా ఆమె సాధించిన విజయాలను చూడకుండా.. ఇలా నీచమైన కామెంట్లు చేసి వారి అసలు మనస్తత్వాన్ని బయటపెట్టుకోవద్దని నెగిటివ్ కామెంట్స్ చేసిన వారికి మిథాలీ ఫ్యాన్స్ సలహా ఇస్తున్నారు.
కాగా, ఇలా సెలబ్రెటీల డ్రెస్సింగ్‌పై వ్యతిరేకత రావడం ఇవాళ కొత్తేమీ కాదు. ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సమయంలో హీరోయిన్ ప్రియాంక చోప్రా ధరించిన వస్త్రాలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయంటూ పలువురు ఆమెపై విరుచుకుపడగా, వాటికి ఆమె ధీటుగా కౌంటర్ ఇచ్చిన విషయం తెల్సిందే.
అలాగే బుల్లితెర యాంకర్ అనసూయ, రేష్మీ, కలెక్టర్ అమ్రపాలి ఇలా పలువురి వస్త్రధారణపై కొందరు విమర్శలు చేశారు. అయితే వృత్తిపరమైన జీవితాన్ని... వ్యక్తిగత జీవితానికి ముడిపెట్టి చూడొద్దని... వారిపై తప్పుడు కామెంట్స్ చేయొద్దని వీరంతా ధీటుగా కొందరు బదులిచ్చారు. అయినప్పటికీ.. ఈ విమర్శలు ఎదుర్కొంటున్న వారి జాబితాలోకి తాజాగా టీమిండియా మహిళా కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఇపుడు చేరడం గమనార్హం.