ధోనీ రిటైర్మెంట్‌కు నో.. వెస్టిండీస్ సిరీస్‌కు దూరం.. ఆర్మీతో 2 నెలలు

శనివారం, 20 జులై 2019 (18:24 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలపై అతడి సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి అరుణ్‌ పాండే తోసిపుచ్చాడు. ఇప్పట్లో రిటైర్మెంట్‌ తీసుకునే ఆలోచనే లేదని అతను క్లారిటీ ఇచ్చాడు. 
 
ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన ప్రపంచకప్‌లో ధోని పేలవ ప్రదర్శనతో నిరాశపరచడంతో అతడి రిటైర్మెంట్‌పై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటికిప్పుడు క్రికెట్‌ నుంచి తప్పుకునే ఆలోచన ధోనీకి లేదు. అయినా భారత క్రికెట్‌కు ఎనలేని సేవలందిస్తున్న గొప్ప ఆటగాడి భవిష్యత్‌పై ఇలాంటి కథనాలు వస్తుండడం బాధాకరమన్నాడు. 
 
ఇదిలా ఉంటే.. వెస్టిండిస్ పర్యటనకు తాను అందుబాటులో ఉండనని బీసీసీఐకి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ముందే చెప్పినట్లు తెలుస్తోంది. ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియా వెస్టిండిస్ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ప్రపంచకప్ ముగిసిన తర్వాత ధోని రిటైర్మెంట్ వార్తలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి.
 
ఈ నేపథ్యంలో ధోని తనకు తానుగా వెస్టిండీస్‌ పర్యటనకు అందుబాటులో ఉండటం లేదు. మరో రెండు నెలలు పారామిలటరీ రెజిమెంట్‌లో చేరి సేవలందిస్తాడు. ప్రస్తుతం ధోని తన ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించడం లేదని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. విండిస్ పర్యటన కోసం టీమిండియాను ఎంపిక చేసేందుకు ఆదివారం సెలక్షన్ కమిటీ సమావేశం కానున్న సంగతి తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు