జార్ఖండ్ డైనమెట్‌గా గుర్తింపు పొందిన మహేంద్ర సింగ్ ధోనీ ఇపుడు భారత క్రికెట్ జట్టుకు ఆపద్బాంధవుడుగా మారాడు. జట్టు కష్టాల్లో ఉన్నపుడు తానున్నానంటూ పలు సందర్భాల్లో నిరూపించాడు. ముఖ్యంగా, కీలకమైన మ్యాచ్‌లలో భారత జట్టు ఘోరంగా విఫలమై కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజ్‌లోకి వచ్చి... అద్భుతమైన పోరాట పటిమతో బ్యాటింగ్ చేస్తూ పరుగులు వర్షం కురిపిస్తాడు. ఫలితంగా ఎన్నో కీలకమైన మ్యాచ్‌లలో టీమిండియా విజయభేరీ మోగించింది.
జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో ధోనీ చేసిన పరుగులను ఓసారి పరిశీలిస్తే, వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 82 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన ధోనీ.. 95 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడమేకాకుండా జట్టు స్కోరును 188కు చేర్చాడు.
అలాగే, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో జట్టు స్కోరు 152/6గా ఉండగా, ఈ మ్యాచ్‌లో ధోనీ పుణ్యమాని భారత జట్టు స్కోరు 203/9 చేసింది. ఈ మ్యాచ్‌లో ధోనీ 45 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో టీమిండియా 29 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పరువు కోల్పోయే పరిస్థితిలో ఉండగా, ధోనీ ఏకంగా సెంచరీ కొట్టి (113 నాటౌట్) జట్టు స్కోరును 227/8కు చేర్చాడు.
అదేవిధంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 76/4గా ఉన్న సమయంలో ధోనీ క్రీజ్‌లోకి వచ్చి 139 (నాటౌట్) పరుగులు చేసి... జట్టు స్కోరు 303కు పెంచాడు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 92/4 స్కోరుతో ఉండగా, ధోనీ (85 నాటౌట్) పుణ్యమాని భారత్ 288/4 పరుగులు చేసింది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 104/5గా ఉన్నపుడు ధోనీ 92 (నాటౌట్) పరుగులు చేసి... జట్టు స్కోరును 247/9గా చేర్చాడు.