ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా, పర్యాటక ఆస్ట్రేలియా జట్టుతో భారత జట్టు ఆదివారం చివరి మ్యాచ్‌ను ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత క్రికెట్ జట్టు ఐసీసీ ర్యాంకుల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంటుంది. దీంతో ఈ మ్యాచ్ కోహ్లీ సేనకు అత్యంత సవాల్‌గా మారింది. ఈ చివరి మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా జరుగనుంది.
కోహ్లీ సేన తొమ్మిది వరుస విజయాల జైత్రయాత్రకు బెంగళూరులో అనూహ్యంగా బ్రేక్ పడింది. దాంతో, కోహ్లీసేన నాగ్‌పూర్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. మరోవైపు సిరీస్ కోల్పోయినా, నాలుగో వన్డేలో గొప్పగా పోరాడిన ఆస్ట్రేలియా విజయంతో ఊరట చెందింది. ఈ మ్యాచ్‌లో కంగారూలు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంది. దీంతో ఒత్తిడంతా భారత్‌పైనే ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఈ వేదికపై ఆసీస్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గడం భారత్‌కు సానుకూలాంశం.
జూలైలో వెస్టిండీస్‌తో నాలుగో వన్డేలో ఓడిన తర్వాత భారత్ వరుసగా తొమ్మిది మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. కొన్ని మ్యాచ్‌ల్లో అలవోకగా నెగ్గినా.. క్లిష్ట పరిస్థితులు ఎదురైన పోరుల్లో జట్టులో ఎవరో ఒకరు అండగా నిలవడంతో కోహ్లీసేన ప్రయాణం సాఫీగా సాగింది. కొన్ని విభాగాల్లో సమస్యలు ఉన్నా.. విజయాలు వస్తుండటంతో అవి పెద్దగా చర్చకు రాలేదు. కానీ, చిన్నస్వామిలో ఓటమితో లోపాలు బయట పడ్డాయి. రోహిత్, రహానే అంత గొప్ప ఆరంభం ఇచ్చినా.. జట్టు సద్వినియోగం చేసుకోకపోవడం శోచనీయం.
అదేవిధంగా చాలా రోజులుగా గెలుపు రుచి చూడని ఆసీస్ ఎట్టకేలకు విజయం అందుకోవడంతో ఆ జట్టుపై ఒత్తిడి తగ్గింది. మూడో వన్డేలో సెంచరీ చేసిన ఫించ్ బెంగళూరులోనూ చెలరేగిపోగా.. వార్నర్ ఫామ్‌లోకి రావడంతో ఆసీస్ టాపార్డర్ బలీయంగా మారింది. నాగ్‌పూర్‌లోనూ ఈ ఇద్దరూ కీలకం కానున్నారు. స్మిత్ విఫలమైనా.. చివర్లో హ్యాండ్స్‌కోంబ్, స్టొయినిస్ మెరుపులు మెరిపించి భారత బౌలర్లకు సవాల్ విసిరారు. ఇక, ఆరంభంలో విఫలమైన ఆసీస్ బౌలర్లు మ్యాచ్ నడుస్తున్న కొద్దీ మెరుగైన ప్రదర్శన చేశారు. కీలక సమయాల్లో వికెట్లు తీసి కోహ్లీసేనపై ఒత్తిడి పెంచారు. ఆఖర్లో అయినా.. భారత బ్యాట్స్‌మెన్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించారు.
జట్లు (అంచనా)
భారత్: రహానె, రోహిత్, విరాట్ (కెప్టెన్), మనీష్, కేదార్, ధోనీ (కీపర్), హార్దిక్, ఉమేష్, షమి, అక్షర్/కుల్దీప్, చాహల్
ఆస్ట్రేలియా: వార్నర్, ఫించ్, స్మిత్ (కెప్టెన్), హెడ్, వేడ్ (కీపర్), స్టొయినిస్, హ్యాండ్స్‌కోంబ్, కమిన్స్, కల్టర్‌నైల్, రిచర్డ్‌సన్, జంపా.