కొలంబో వేదికగా జరిగిన నిదాస్ ముక్కోణపు ట్వంటీ20 టోర్నీలో భారత్ థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసుకుంది. క్రికెట్ పసికూన బంగ్లాదేశ్ చేతిలో చావుతప్పినట్టుగా చివరి బంతికి సిక్స్ కొట్టడంతో రోహిత్ సేన గెలుపును రుచిచూసింది. ఫలితంగా ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది.
భారత క్రికెటర్ దినేష్ కార్తీక్ అద్భుత ఆటతీరుతో ముక్కోణపు టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓటమి చవిచూడకుండా తప్పించుకుంది. దీంతో టీమిండియా ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. అయితే టీమిండియాతో పాటు శ్రీలంక అభిమానులు కూడా బంగ్లాపై గెలుపుపై హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
మైదానంలో ఓ శ్రీలంక అభిమానైతే ఏకంగా టీమిండియా అభిమానిని ఎత్తుకుని తిప్పి ఆనందంలో ఉబ్బితబ్బిబయ్యాడు. ఈ ఫొటో నెట్‌లో వైరల్‌గా మారింది. తనకు గుర్తుండిపోయే క్షణంగా రోహిత్ శర్మ ఇదే ఫొటోను ట్వీట్ చేశాడు. అంతేనా, క్రికెట్ గెలిచిందంటూ శ్రీలంక, టీమిండియా అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఇక్కడ భారత్ గెలిస్తే శ్రీలంక అభిమానులు సంబరాలు చేసుకోవడానికి కారణం లేకపోలేదు. ఈ టోర్నీలో శ్రీలంకపై బంగ్లాదేశ్ గెలిచింది. ఆ సందర్భంగా మైదానంలో నాగిని డ్యాన్స్ చేస్తూ బంగ్లా ఆటగాళ్లు ప్రవర్తించిన తీరు శ్రీలంక అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది.
దీంతో ఫైనల్ మ్యాచ్‌లో వారంతా భారత్‌కు మద్దతుగా నిలిచారు. టీమిండియా గెలవడంతో శ్రీలంక అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 'ఇప్పుడు చేయండి నాగిని డ్యాన్స్‌లు' అంటూ సోషల్ మీడియా వేదికగా శ్రీలంక అభిమానులు బంగ్లాదేశ్ క్రికెటర్లకు చురకలంటిస్తున్నారు.
ఇదిలావుండగా, ఒక దశలో భారత్ గెలుపు దాదాపు అసాధ్యమే అనుకున్నారంతా. కానీ దినేష్ కార్తీక్ దాన్ని సాధించి చూపాడు. చివర్లో వచ్చి మెరుపులు మెరిపించిన కార్తీక్ కేవలం 8 బంతుల్లో 29 పరుగులు చేశాడు. చివరి బంతికి సిక్స్ మొత్తం మ్యాచ్‌కే హైలైట్. టీమిండియా గెలవాలంటే చివరి బాల్‌కు 5 పరుగులు చేయాల్సి ఉంది. ఫోర్ కొడితే సూపర్ ఓవర్.
ఇలాంటి దశలో బంగ్లా పార్ట్‌టైమ్ బౌలర్ సౌమ్య సర్కార్.. వికెట్లకు దూరంగా వేసిన బంతిని కవర్స్ మీదుగా సిక్సర్‌గా మలిచాడు కార్తీక్. అంతే భారత అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోగా.. బంగ్లా ప్లేయర్స్ గ్రౌండ్‌లోనే కుప్పకూలారు. భారత డ్రెస్సింగ్ రూమ్‌లో సంబరాలు అంబరాన్నంటాయి.