భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఇప్పటికే ఆతిథ్య ఆసీస్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ముఖ్యంగా, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 32 పరుగులకే ఆలౌట్ కావడం సగటు భారతీయ క్రికెట్ అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ క్రమంలో భారత యువ క్రికెటర్ పృథ్వీ షాకు భారత టెస్ట్ జట్టులో స్థానం దక్కింది. కానీ, ఈ గోల్డెన్ ఛాన్స్‌ను పృథ్వీ షా సద్వినియోగం చేసుకోలేక పోయాడు.
గత ఫిబ్రవరిలో న్యూజిలాండ్ పర్యటనలో విఫలమైన తర్వాత, ఐపీఎల్‌లోనూ ప్రతిభను కనబరచలేకపోయిన పృథ్వీ, గత రికార్డును దృష్టిలో పెట్టుకుని తొలి టెస్టుకు చాన్సిచ్చారు. ఇదేసమయంలో ప్రాక్టీస్ మ్యాచ్‌లలో రాణిస్తున్న శుభమన్ గిల్‌ను పక్కన బెట్టడంపై పలువురు మాజీలు మ్యాచ్‌కు ముందే విమర్శలు గుప్పించారు.
ఇక తనపై వచ్చిన విమర్శలకు మీడియా ముందు సమాధానం ఇవ్వలేకపోయిన పృథ్వీ షా, తన ఇన్ స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. "ఎవరైనా ఏదైనా చేసేందుకు ప్రయత్నం చేస్తుంటే, కొందరు తక్కువ చేసి మాట్లాడుతుంటారు. అంటే తాము ఏదో చేయగలమని, వాళ్లు ఏమీ చేయలేరని అర్థం" అంటూ సెటైర్ వేశాడు.