పూణె పిచ్‌ను బుకీలకు అమ్మేసిన క్యూరేటర్...

బుధవారం, 25 అక్టోబరు 2017 (11:52 IST)
మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగనుంది. అయితే, ఈ మ్యాచ్‌ ప్రారంభానికి కొన్ని గంటల ముందు ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురిచేసే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. 
 
మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎంసీఏ)కు చెందిన క్యూరేటర్ ఏకంగా పిచ్‌ను బుకీలకు అమ్మేస్తూ.. 'ఇండియా టుడే' నిర్వహించిన స్టింగ్‌ ఆపరేషన్‌లో అడ్డంగా బుక్కయ్యాడు. రెండో మ్యాచ్‌ నేపథ్యంలో బుకీల డిమాండ్లకు అనుగుణంగా పిచ్‌ను మార్చేందుకు సిద్ధమంటూ అతను కెమెరా ముందు ఆఫర్‌ ఇచ్చాడు.
 
'ఇండియా టుడే' రిపోర్టర్లు బుకీలుగా పిచ్‌ క్యూరేటర్‌ పాండురంగ్‌ సల్గావుంకర్‌ను కలిశారు. బుకీలుగా పరిచయం చేసుకున్న రిపోర్టర్ల డిమాండ్లకు అనుగుణంగా పిచ్‌ను మార్చేందుకు సిద్ధమంటూ సల్గావుంకర్‌ ఆఫర్‌ ఇచ్చాడు. ఇద్దరు ఆటగాళ్లు బౌన్సీ పిచ్‌ కావాలని కోరుకుంటున్నారని రిపోర్టర్లు కోరగా.. సరే పిచ్‌ను అలాగే మారుస్తానంటూ క్యూరేటర్‌ చెప్పాడు. 
 
337 నుంచి 340 పరుగులు అవలీలగా చేసేవిధంగా పిచ్‌ను తయారుచేస్తున్నట్టు అతను తెలిపాడు. 337 పరుగులను కూడా ఈ పిచ్‌ మీద ఛేదించవచ్చునని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా రిపోర్టర్లు స్వయంగా పిచ్‌ను పరిశీలించేందుకు సల్గావుంకర్‌ అనుమతించడం గమనార్హం. ఇది బీసీసీఐ, ఐసీసీ నిబంధనలకు పూర్తి విరుద్ధం.
 
మీడియాలో ప్రసారమైన ఈ స్టింగ్‌ ఆపరేషన్‌పై ఎంసీఏ అధ్యక్షుడు అభయ్‌ ఆప్తే స్పందిస్తూ ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నామని, విచారణలో ఎవరైనా దోషులుగా తేలితే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. బుకీల డిమాండ్లకు అనుగుణంగా పిచ్‌ను మారుస్తానంటూ క్యూరేటర్‌ పేర్కొనడం కలకలం రేపుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు