భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి ద్రవిడ్ దరఖాస్తు

మంగళవారం, 26 అక్టోబరు 2021 (17:14 IST)
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుత ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి పదవీకాలం ప్రస్తుతం దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల తర్వాత ముగియనుంది.
 
ఐసీసీ టోర్నీ తర్వాత రవిశాస్త్రి కొనసాగే అవకాశాలు లేకపోవడంతో బీసీసీఐ కొత్త కోచ్, ఇతర సహాయక సిబ్బంది కోసం ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించింది. టీమిండియా హెడ్ కోచ్ రేసులో అందరికంటే ముందున్న రాహుల్ ద్రావిడ్ కూడా కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
 
భారత జట్టు ప్రధాన కోచ్‌గా వచ్చేందుకు ద్రావిడ్ తొలుత ఆసక్తి చూపనప్పటికీ, ఇటీవల దుబాయ్‌లో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో భేటీ అనంతరం అంగీకరించినట్టు తెలుస్తోంది. టీమిండియా కొత్త కోచ్ రాహుల్ ద్రావిడేనంటూ ఆ సమయంలోనే కథనాలు కూడా వచ్చాయి. 
 
ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడెమీ ఛైర్మన్‌గా రాహుల్ ద్రావిడ్ ఉన్నారు. ఇపుడు ద్రవిడ్ ప్రధాన కోచ్‌గా ఎంపిక చేస్తే ఆయన స్థానంలో మరో మాజీ క్రికెటర్, హైదరాబాద్ వాసి వీవీఎస్ లక్ష్మణ్‌ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు