నెగ్గిన కోహ్లీ మాట.. భారత క్రికెట్ జట్టు కోచ్‌గా రవిశాస్త్రి

మంగళవారం, 11 జులై 2017 (17:00 IST)
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి ఎంపికయ్యారు. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారిక ప్రకటన చేసింది. దీంతో కోచ్ ఎంపికలో టీమిడియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాటే నెగ్గినట్టయింది. కోచ్‌గా ఉన్న అనిల్ కుంబ్లే రాజీనామాతో కొత్త కోచ్ ఎంపిక అనివార్యమైన విషయం తెల్సిందే. 
 
ఈ పదవికి సోమవారం ఇంట‌ర్వ్యూలను సచిన్, లక్ష్మణ్, గంగూలీలతో కూడిన క్రికెట్ అడ్వైజ‌రీ క‌మిటీ నిర్వహించింది. అయితే, మంగ‌ళ‌వారం సాయంత్రంలోగా కొత్త కోచ్ పేరును ప్ర‌క‌టించాల్సిందేన‌ని సీఓఏ హెడ్ వినోద్ రాయ్ బోర్డుకు స్ప‌ష్టంచేయ‌డంతో ర‌విశాస్త్రిని పేరును హ‌డావిడిగా ప్ర‌క‌టించేసింది. 
 
కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా మొద‌టి నుంచీ ర‌విశాస్త్రినే కోచ్‌గా నియ‌మించాల‌ని కోరుతూ వచ్చారు. ఆయన కోరినట్టుగానే రవిశాస్త్రిని హెడ్ కోచ్‌గా నియమిస్తూ ప్రకటన జారీ అయింది. కోచ్‌గా 2019 వరల్డ్ కప్ క్రికెట్ వరకు రవిశాస్త్రి కొనసాగుతారు. 
 
1981-92 వరకు భారతజట్టుకు రవిశాస్త్రి ప్రాతినిథ్యం వహించారు. 80 టెస్టులు, 150 వన్డే మ్యాచ్లు ఆయన ఆడారు. టెస్టుల్లో 3,830, వన్డేల్లో 3,108 పరుగులు చేశారు. 1983లో వరల్డ్ కప్ గెలిచిన జట్టులో రవిశాస్త్రి సభ్యుడిగా ఉన్నారు. 2014-16లో టీమ్ డైరెక్టర్‌గా రవిశాస్త్రి పనిచేశారు. 

వెబ్దునియా పై చదవండి