ఐపీఎల్ 2024 : ఊపుమీదున్న బెంగుళూరును చెన్నై నిలువరించగలదా?

ఠాగూర్

శుక్రవారం, 17 మే 2024 (09:12 IST)
ఐపీఎల్ 2024 సీజన్ పోటీల్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుల ఈ నెల 18వ తేదీన బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తలపడనున్నాయి. ఈ టోర్నీలో మాంచి ఊపుమీదున్న రాయల్ ఛాలెంజర్స్ జట్టును చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిలువరిస్తుందా లేదా అన్నది ఇపుడు ప్రశ్నార్థకంగా మారింది. 
 
కాగా, గురువారం హైదరాదాబ్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాట్ కమిన్స్ నాయకత్వంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ తాజా సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. గురువారం గుజరాత్ టైటాన్స్‌తో హైదరాబాద్‌‌లో మ్యాచ్ జరగాల్సి ఉండగా, వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయింది. దాంతో ఇరుజట్లకు చెరొక పాయింట్ కేటాయించారు.
 
టోర్నీలో ఇప్పటిదాకా 14 మ్యాచ్‌లు ఆడిన సన్ రైజర్స్ ఖాతాలో మొత్తం 15 పాయింట్లు ఉన్నాయి. ఇప్పటికే కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌లో ప్రవేశించాయి. ఇప్పుడు, సన్ రైజర్స్ ప్లేఆఫ్స్ చేరిన మూడో జట్టయింది. సన్ రైజర్స్ ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకున్న నేపథ్యంలో, అటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. 
 
ఇక, నాలుగో స్థానం కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆసక్తికర పోరు నెలకొంది. ఆర్సీబీ, సీఎస్కే మ్యాచ్ రేపు (మే 18) బెంగళూరులో జరగనుంది. వరుస విజయాలతో ఊపుమీదున్న బెంగళూరును నిలువరించేందుకు చెన్నై ఏం చేస్తుందన్నది ఆసక్తి కలిగించే అంశం.
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 200 పరుగులు చేస్తే, లక్ష్య ఛేదనను 18.1 ఓవర్లలో పూర్తి చేసిన జట్టు రన్ రేట్ పరంగా నాలుగో బెర్తును ఖాయం చేసుకుంటుంది. లేదా, ఈ మ్యాచ్ లో 18 పరుగుల తేడాతో గెలిచిన పట్టు నాలుగో బెర్తును దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు