ఐపీఎల్ ఛైర్మన్ పదవి వద్దు.. బీసీసీఐ చీఫ్ పదవి నుంచి సౌరవ్ గంగూలీ ఔట్!
బుధవారం, 12 అక్టోబరు 2022 (09:59 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్ష పదవి నుంచి సౌరవ్ గంగూలీ తప్పుకోనున్నారు. ఆ స్థానంలో సీనియర్ మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ ఎంపిక కానున్నారు. అదేసమయంలో గంగూలీ త్వరలోనే ఐసీసీ ఛైర్మన్‌గా ఎంపికయ్యే అవకాశాలు కూడా లేనట్టేనన్న వార్తలు వస్తున్నాయి. గంగూలీ ఐసీసీ ఛైర్మన్ అయ్యేందుకు కూడా బీసీసీఐ మద్దతు లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. అదేసమయంలో ఐపీఎల్ ఛైర్మన్ పదవిని చేపట్టేందుకు గంగూలీ ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు.
సౌరవ్ గంగూలీ తర్వాత బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ పదవి చేపట్టడం దాదాపు ఖాయమైనట్లు సమాచారం. 1983లో ప్రపంచ కప్ గెలిచిన జట్టులో రోజర్ బిన్నీ కూడా సభ్యుడు. ఆయన ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కెఎస్‌సీఏ)లో ఆఫీస్ బేరర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. గతంలో సెలక్షన్ కమిటీలో సభ్యుడిగా కూడా పనిచేసిన అనుభవం బిన్నీకి ఉంది.
18వ తేదీన జరగనున్న ఎన్నికలు, వార్షిక సమావేశానికి సంబంధించి బీసీసీఐ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్స్‌లో కేఎస్‌సీఏ కార్యదర్శి సంతోష్ మోహన్ పేరుకు బదులు ప్రతినిధిగా బిన్నీ పేరు బయటకు రావడంతో ఈ ఊహాగానాలను జోరందుకొన్నాయి.
అక్టోబరు 18వ తేదీన ముంబైలో బీసీసీఐకి ఎన్నికలు జరగనున్నాయి. వీటికి సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ 11-12 తేదీల్లో జరుగుతుంది. 13వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 14వ తేదీ వరకు తుది గడువు.
ప్రస్తుత బీసీసీఐ కార్యదర్శి జై షా స్థానం మారకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇక బీసీసీఐ ఉపాధ్యక్ష పదవి బరిలో రాజీవ్‌శుక్లా ముందుండగా.. జాయింట్ సెక్రెటరీ పోస్టుకు దేబోజిత్ సైకియా, రోహన్ జైట్లీలు పోటీ పడే అవకాశం ఉంది. లీగ్ క్రికెట్ ఛైర్మన్‌గా అరుణ్ ధుమాల్ ఎంపిక కావచ్చనే ప్రచారం జరుగుతోంది.
'కేంద్ర మంత్రి వర్గంలోని ప్రభావవంతమైన వ్యక్తి బోర్డు పదవుల ఎంపిక విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు' అని బీసీసీఐ వర్గాలు ఆంగ్ల వార్తా సంస్థ పీటీఐకి వెల్లడించాయి. సోమవారం సాయంత్రమే ముంబై చేరుకున్న బీసీసీఐ ఛైర్మన్ గంగూలీ ఢిల్లీలోని పెద్దలతో మంతనాలు సాగించినట్లు సమాచారం. అయితే రెండోసారి దాదా పదవీకాలం పొడిగించేందుకు వారు ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది.