వాంఖడే స్టేడియంలో సిక్సర్లు - ఫోర్ల వర్షం... ఇంగ్లండ్ ముంగిట భారీ టార్గెట్ - త్రీ వికెట్స్ డౌన్

శనివారం, 21 అక్టోబరు 2023 (19:07 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, ముంబైలోని వాంఖడే స్టేడియంలో సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు స్టేడియంలో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించారు. దీంతో ఇంగ్లీష్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఫలితంగా సఫారీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసి, ఇంగ్లండ్ ముంగిట 400 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. 
 
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుందంది. కానీ, ఆ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. ఇంగ్లండ్ బౌలింగ్‌ను సఫారీ ఆటగాళ్లు ఉతికి ఆరేశారు. ఓపెనర్ క్వింటన్ డికాక్ (4) వికెట్‌ను ఆదిలోన పడగొట్టామన్న సంబరం తప్పితే, ఈ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సఫారీ ఓపెనర్ రీజా హెండ్రిక్స్ తో మొదలుపెడితే, ఆఖరులో మార్కోయన్‌సెన్ బాదుడే బాదుడు. 
 
మధ్యలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ హెన్రిచ్ క్లాసెన్ వీర మాస్ సెంచరీ ఇన్నింగ్స్‌కే హైలైట్‌‌గా నిలిచింది. క్లాసెన్ 67 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సులతో 109 పరుగులు చేయడం విశేషం. అలాగే, కెప్టెన్ టెంబా బవుమా స్థానంలో జట్టులోకి వచ్చిన రీజా హెండ్రిక్స్ 75 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులతో 85 పరుగులు చేశాడు. వాండర్ డుస్సెన్ 60, తాత్కాలిక సారథి ఐడెన్ మార్ క్రమ్ 42 పరుగులతో స్కోరు బోర్డును ముందుకు ఉరికించారు.
 
మ్యాచ్ ఆఖరులో మార్కో‌‌యన్‌సెన్ ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడి మెరుపు అర్థశతకం నమోదు చేశాడు. యన్‌సెన్ 42 బంతుల్లో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి స్కోరు 3 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయంటే ఇంగ్లండ్ బౌలింగ్‌ను ఎలా బాదారో అర్థం చేసుకోవచ్చు. ఇంగ్లండ్ బౌలర్లలో రీస్ టాప్లే 3, గస్ ఆట్కిన్సన్ 2, అదిల్ రషీద్ 2 వికెట్లు తీశారు. ఆ తర్వాత 400 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 24 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు