ట్వంటీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ ఇదే : భారత్ తొలి మ్యాచ్ ఎవరితో ఆడుతుందంటే..

మంగళవారం, 17 ఆగస్టు 2021 (12:14 IST)
దుబాయ్ వేదికగా ప్రపంచ ట్వంటీ20 కప్ టోర్నీ జరుగనుంది. వచ్చే అక్టోబ‌రు 17వ తేదీ నుంచి న‌వంబ‌రు 14వ తేదీ వరకు ఈ మెగా ఈవెంట్ జరుగుతుంది. ఈ టోర్నీలో భారత్ త‌న తొలి మ్యాచ్‌ను దాయాది పాకిస్థాన్‌తోనే అడుతుంది. అక్టోబ‌రు 24వ తేదీన ఈ మ్యాచ్ దుబాయ్‌ వేదికగా జరుగుతుంది. 
 
ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను మంగ‌ళ‌వారం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ( రిలీజ్ చేసింది. ఇక రౌండ్ 1లో గ్రూప్ బిలోని ఒమ‌న్, పపువా న్యూ గినియా మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభంకానుంది. అక్టోబ‌ర్ 17న ఈ మ్యాచ్ జ‌రుగుతుంది. అదే రోజు స్కాట్లాండ్‌, బంగ్లాదేశ్ మ‌రో మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి.
 
ఇక అక్టోబ‌రు 23వ తేదీన అస‌లు టోర్నీ అంటే సూప‌ర్ 12 స్టేజ్ ప్రారంభ‌మ‌వుతుంది. అబుదాబిలో జ‌ర‌గ‌బోయే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా త‌ల‌ప‌డ‌తాయి. అదే రోజు దుబాయ్‌లో సాయంత్రం ఇంగ్లండ్‌, వెస్టిండీస్ ఆడ‌నున్నాయి. ఇక గ్రూప్ 2లో భాగంగా అక్టోబ‌ర్ 24న భారత్, పాకిస్థాన్ మ‌ధ్య దుబాయ్‌లో తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. భార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి 7.30 గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం కానుంది.
 
టీమిండియా త‌న త‌ర్వాతి మ్యాచ్‌ల‌ను అక్టోబ‌రు 31న న్యూజిలాండ్‌తో, న‌వంబ‌రు 3న ఆఫ్ఘ‌నిస్థాన్‌తో, నవంబ‌రు 5న గ్రూప్ బిలో టాప్ పొజిష‌న్‌లో నిలిచిన టీమ్‌, న‌వంబ‌రు 8న గ్రూప్ ఎలో రెండో స్థానంలో నిలిచిన టీమ్‌తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ల‌న్నీ భార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి 7.30 గంట‌ల‌కే ప్రారంభ‌మ‌వుతాయి.
 
న‌వంబ‌రు 10న అబుదాబిలో తొలి సెమీఫైన‌ల్ జ‌రుగుతుంది. ఆ మ‌రుస‌టి రోజు అంటే న‌వంబ‌రు 11న దుబాయ్‌లో రెండో సెమీస్ జ‌రుగుతుంది. రెండు సెమీఫైన‌ల్స్‌కు రిజ‌ర్వ్ డే ఉంటుంది. ఫైన‌ల్ న‌వంబ‌ర్ 14న దుబాయ్‌లో జ‌ర‌గుతుంది. మ‌రుస‌టి రోజును రిజ‌ర్వ్ డేగా ఉంచారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు