వరల్డ్ టీ20 గ్రూపులు ప్రకటించిన ఐసీసీ - ఒకే గ్రూపులో దాయాదులు

శుక్రవారం, 16 జులై 2021 (16:46 IST)
వరల్డ్ టీ-20 ప్రపంచ కప్ పోటీలను నిర్వహించి తీరాలన్న పట్టుదలతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఉంది. దీంతో ఆ దిశగా ఐసీసీ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీలో పాల్గొనే జట్లతో గ్రూపులను ప్రకటించింది. 
 
గత యేడాది భారత్‌లో జరగాల్సిన ఈ మెగా ఈవెంట్ కరోనా వ్యాప్తి కారణంగా యూఏఈ తరలిపోయిన సంగతి తెలిసిందే. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకు దుబాయ్, అబుదాబి, షార్జా, ఒమన్ క్రికెట్ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ టోర్నీ కోసం గ్రూపులను ఐసీసీ ప్రకటించింది. ఈ ఏడాది మార్చి 20 నాటికి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఆయా జట్ల స్థానాలను బట్టి వరల్డ్ కప్ గ్రూపుల్లో వాటికి చోటుకల్పించారు. టోర్నీ ప్రాథమిక దశ రెండు రౌండ్లలో సాగనుంది. ర్యాంకుల్లో టాప్-8 జట్లు నేరుగా రెండో రౌండ్ (సూపర్-12 దశ)లో ఆడతాయి. ఈ ఎనిమిది జట్లను గ్రూప్-1, గ్రూప్-2లో చేర్చారు.
 
ఐసీసీ ర్యాంకుల్లో దిగువన ఉన్న జట్లను, అర్హత పోటీల ద్వారా టోర్నీలో ప్రవేశం పొందిన జట్లను గ్రూప్-ఏ, గ్రూప్-బిగా విభజించారు. ఇవి తొలి రౌండ్ మ్యాచ్‌లు ఆడి, ఆపై రెండో రౌండ్ (సూపర్-12)కు అర్హత సాధిస్తాయి. 
 
అయితే, గ్రూప్-ఏ, గ్రూప్-బిలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు సూపర్-12 దశకు చేరతాయి. టాప్-8 జట్లతో కలిసి ఈ 4 చిన్న జట్లు కూడా కూడా రెండో రౌండ్ (సూపర్-12) ఆడతాయి. అయితే, చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు గ్రూప్-2లో ఉండటం గమనార్హం. 
 
ఐసీసీ ప్రకటించిన గ్రూపుల వివరాలను పరిశీలిస్తే... గ్రూప్-ఏలో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా జట్లు ఉండగా, గ్రూపు బిలో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పాపువా న్యూ గినియా, ఒమన్ జట్లు ఉన్నాయి. 
 
ఇకపోతే, సెకండ్ రౌండ్ (సూపర్-12) గ్రూప్-1లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్, గ్రూప్-ఏ విన్నర్, గ్రూప్-బి రన్నరప్. అలాగే, గ్రూప్-2లో ఇండియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్, గ్రూప్-బి విన్నర్, గ్రూప్-ఏ రన్నరప్ జట్లు ఉంటాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు