రెచ్చిపోయిన జేమీసన్ - భారత్ 217 రన్స్‌కు ఆలౌట్

సోమవారం, 21 జూన్ 2021 (10:43 IST)
ఇంగ్లండ్‌లోని సౌతాంఫ్టన్ వేదికగా జరుగుతున్న ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ పోటీలో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకే ఆలౌట్ అయింది. ప్రత్యర్థి న్యూజిలాండ్ బౌలర్ జేమీసన్ చెలరేగి ఐదు వికెట్లు తీయడంతో భారత్ ఇన్నింగ్స్ కుప్పకూలింది. 
 
స్వింగ్‌కు అనుకూలిస్తున్న పరిస్థితుల్లో కివీస్ పేసర్లు భారత బ్యాటింగ్ లైనప్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. ముఖ్యంగా, పొడగరి పేస్ బౌలర్ కైల్ జేమీసన్ టీమిండియా వెన్నువిరిచాడు. 22 ఓవర్లు బౌలింగ్ చేసిన జేమీసన్ 31 పరుగులిచ్చి 5 వికెట్లు తీయడం విశేషం. 
 
ఈ క్రమంలో జేమీసన్ ఏకంగా 12 ఓవర్లు మెయిడెన్ చేశాడు. ఇక, సీనియర్ బౌలర్లు బౌల్ట్, వాగ్నర్ చెరో రెండు వికెట్లతో సత్తా చాటగా, టిమ్ సౌథీ ఓ వికెట్ పడగొట్టాడు. భారత ఇన్నింగ్స్‌లో వైస్ కెప్టెన్ అజింక్యా రహానే సాధించిన 49 పరుగులే అత్యధికం. 
 
మ్యాచ్ చివర్లో అశ్విన్ (22) వేగంగా ఆడడంతో భారత్ స్కోరు 200 దాటింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. వర్షం కారణంగా తొలి రోజు ఆట పూర్తిగా రద్దు అయింది. రెండు, మూడు రోజుల్లో మ్యాచ్ జరిగింది. సోమవారం నాలుగో రోజు ఆట జరుగనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు