చెన్నై టెస్ట్ మ్యాచ్ : 134 రన్స్‌కే ఇంగ్లండ్ ఆలౌట్... 195 పరుగుల ఆధిక్యంలో భారత్

ఆదివారం, 14 ఫిబ్రవరి 2021 (18:03 IST)
చెన్నై కేంద్రంగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కష్టాల్లో కడలిని ఈదుతోంది. ఇంగ్లండ్ 134 పరుగులకే చాప చుట్టేసింది. భారత స్పిన్నర్లు దెబ్బకు ఇంగ్లండ్ చేతులెత్తేసింది. ప్రస్తుతం భారత్ 195 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. 
 
అంతకుముందు, భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి రోజున భారత ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో రాణించాడు. శనివారం 88 ఓవర్ల పాటు ఆడి 6 వికెట్ల నష్టానికి 300 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నేడు బ్యాటింగ్‌ను కొనసాగించిన ఇండియా, మరొక్క పరుగు జోడించి, అక్సర్ పటేల్, ఇషాంత్ శర్మ వికెట్లను కోల్పోయింది.
 
వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్‌కు టెయిలెండర్లు ఎవరూ అండగా నిలువలేకపోవడంతో, తొలిరోజు స్కోరుకు మరో 29 పరుగులు జోడించే లోగానే భారత జట్టు తన చివరి నాలుగు వికెట్లనూ కోల్పోయింది. అదేసమయంలో ఇంగ్లండ్ బౌలర్లలో మోయిన్ అలీకి 4, ఓలీ స్టోన్‌కు 3 వికెట్లు లభించగా, జాక్ లీచ్ కు 2, జోయ్ రూట్ కు 1 వికెట్ లభించాయి. 
 
ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన ఇంగ్లండ్.. రవిచంద్రన్ అశ్విన్ దెబ్బకు వణికిపోయింది. ఇంగ్లండ్ జట్టు కేవలం 134 పరుగులకే ఆలౌట్ అయింది. ముఖ్యంగా, ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోమారు ఈ సిరీస్‌లో 5 వికెట్ల ప్రదర్శన కనబర్చిన వేళ ఇంగ్లండ్ జట్టు 134 పరుగులకే కుప్పకూలింది. 
 
అశ్విన్ 23.5 ఓవర్లలో 43 పరుగులిచ్చి 5 వికెట్లు తీయడం ఈ మ్యాచ్ రెండో రోజు ఆటలో హైలైట్‌గా నిలిచింది. కొత్త స్పిన్నర్ అక్షర్ పటేల్ 2 వికెట్లు తీయగా, ఇషాంత్ శర్మకు కూడా 2 వికెట్లు దక్కాయి. సిరాజ్ ఓ వికెట్ సాధించాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ 42 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడితే అత్యధిక వ్యక్తిగత స్కోరు.
 
కాగా, భీకర ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌ను భారత బౌలర్లు కేవలం 6 పరుగులకే ఔట్ చేశారు. దీంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలిపోయింది. భారత బౌలర్లు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌కు కుదురుకునే అవకాశమే ఇవ్వలేదు. క్రమం తిప్పకుండా వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టు పనిబట్టారు. ఓలీ పోప్ 22 పరుగులు చేయగా, స్టోక్స్ 18 పరుగులు సాధించాడు. చివరకు ఇంగ్లండ్ జట్టు 134 పరుగులకే ఆలౌట్ అయింది. 
 
ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన భారత్... ఓ వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 195 పరుగులతో కలుపుకుని టీమిండియా ఓవరాల్ ఆధిక్యం 249 పరుగులకు చేరింది. ఆటకు ఇంకా మూడ్రోజుల సమయం మిగిలుండటంతో మ్యాచ్ ఫలితంపై సోమవారం స్పష్టత రానుంది. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ 25 పరుగులతో, ఛటేశ్వర్ పుజారా 7 పరుగులతో ఉన్నారు. యువ ఓపెనర్ శుభ్ మాన్ గిల్ 14 పరుగులు చేసి ఇంగ్లండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ జాక్ లీచ్ బౌలింగ్‌‍‌లో అవుటయ్యాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు