విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు.. ఏంటది?

శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (09:33 IST)
భారత మాజీ కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. దీంతో ఆయన క్రికెట్ దిగ్గజాలతో పాటు సినీ రాజకీయ సెలెబ్రిటీలు అభినందనలు తెలుపుతున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ట్వీట్, రీట్వీట్స్ చేస్తున్నారు. ఇంతకీ కోహ్లీ చేసిన రికార్డు ఏంటో ఓసారి తెలుసుకుందాం. 
 
దుబాయ్ వేదికగా ఆసియా క్రికెట్ టోర్నీ జరిగింది. ఈ టోర్నీలో సూపర్-4 దశలో భారత చెత్త ఆటతీరుతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే, చివరి మ్యాచ్‌లో మాత్రం భారత ఆటగాళ్లు కొదమ సింహాల్లో రెచ్చిపోయారు. ఫలితంగా 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఇందులో విరాట్ కోహ్లీ ఒక్కడే చేసిన పరుగులు 122 (నాటౌట్). కేవలం 61 బంతుల్లో ఈ పరుగులు చేశాడు. ఇందులో ఆరు సిక్స్‌లు, 12 ఫోర్లు ఉన్నాయి. ఈ శతకంతో కోహ్లీ ఖాతాలో 71 సెంచరీలు చేరాయి. 
 
ఇప్పటివరకు క్రికెట్ ప్రపంచంలో అన్ని ఫార్మెట్లలో కలిపి వంద సెంచరీలు చేసిన రికార్డు భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉంది. ఆ తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ పేరుతో ఉంది. ఈయన 71 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇపుడు రికీ సరసన విరాట్ కోహ్లీ చేరాడు. గురువారం రాత్రి ఆప్ఘనిస్థాన్ జట్టుపై చోసిన టీ20 సెంచరీతో కోహ్లీ అన్ని ఫార్మెట్లలో చేసిన సెంచరీల సంఖ్య 71కు చేరింది. 
 
దీంతో కోహ్లీని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో అభినందన పోస్టుల వరద పారుతోంది. భారత్‌కు చెందిన క్రికెటర్లు, మాజీ క్రికెటర్లే కాకుండా దాదాపుగా అన్ని దేశాలకు చెందిన క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు కోహ్లీని ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఫలితంగా కోహ్లీ ప్రశంసల వర్షంలో తడిసి ముద్దవుతున్నాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు