పంజాబ్ రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల అవినీతి బాగోతం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తోంది. కేవలం రూ.8 లక్షల లంచం ఆరోపణలతో మొదలైన కేసులో సోదాలు చేయగా ఆయన నివాసంలో ఏకంగా రూ.5 కోట్ల నగదు కట్టలు బయటపడటం సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో రోపర్ రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ) హర చరణ్ సింగ్ భుల్లార్‌ను, అతడి మధ్యవర్తి కృష్ణాను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అరెస్టు చేసింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఫతేగఢ్ సాహిబ్‌కు చెందిన ఆకాశ్ బట్టా అనే స్క్రాప్ వ్యాపారి ఐదు రోజుల క్రితం సీబీఐకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తన వ్యాపారానికి సంబంధించి తప్పుడు కేసులో ఇరికిస్తానని డీఐజీ భుల్లార్ బెదిరిస్తున్నారని, కేసును "సెటిల్" చేయడానికి రూ.8 లక్షల లంచంతో పాటు ప్రతినెలా మామూళ్లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ డబ్బును తన మధ్యవర్తి కృష్ణా ద్వారా పంపాలని డీఐజీ సూచించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ జరిపిన సీబీఐ, నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి పక్కా స్కెచ్ వేసింది. చండీగఢ్‌లోని సెక్టార్ 21లో వ్యాపారి నుంచి మధ్యవర్తి కృష్ణా రూ.8 లక్షలు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. వెంటనే, ఫిర్యాదుదారుడితో డీఐజీకి ఫోన్ చేయించగా, డబ్బు అందినట్లు ఆయన ధ్రువీకరించారు. ఈ ఆధారంతో మొహాలీలోని కార్యాలయంలో ఉన్న డీఐజీ భుల్లార్‌ను, మధ్యవర్తి కృష్ణాను సీబీఐ బృందం అరెస్టు చేసింది.
ఐపీఎస్ అధికారిని అరెస్టు చేసిన తర్వాత డీఐజీకి సంబంధించిన రోపర్, మొహాలీ, చండీగఢ్‌లోని పలు నివాసాల్లో సీబీఐ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో బయటపడిన అక్రమాస్తుల వివరాలు చూసి అధికారులు సైతం విస్తుపోయారు. సుమారు రూ.5 కోట్ల నగదు (లెక్కింపు ఇంకా కొనసాగుతోంది), కిలోన్నర బంగారం, ఆభరణాలు, పంజాబ్‌లోని స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు, బెంజ్, ఆడి వంటి రెండు లగ్జరీ కార్ల తాళాలు, 22 ఖరీదైన చేతి గడియారాలు, లాకర్ తాళాలు, 40 లీటర్ల విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు మధ్యవర్తి కృష్ణా ఇంటి నుంచి మరో రూ. 21 లక్షల నగదును సీజ్ చేశారు.