56 బంతుల్లో కోహ్లీ సెంచరీ... మళ్లీ శతకబాదిన కోహ్లి

ఆదివారం, 8 మే 2016 (13:11 IST)
ఐపీఎల్‌లో విరాట్ కోప్లీ పరుగుల వరద పారిస్తున్నారు. అర్థసెంచరీ చేస్తేనే చాలనుకునే టీ20ల్లో వరుస సెంచరీలు చేస్తున్నాడు. పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లి (108 నాటౌట్‌; 58 బంతుల్లో 8×4, 7×6) మరోసారి చెలరేగిన వేళ.. రైజింగ్‌ పుణెపై బెంగళూరు అద్భుత విజయాన్ని సాధించింది. విరాట్‌కు ఈ సీజన్లో ఇది రెండో సెంచరీ. 
 
శనివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత  మొదట బ్యాటింగ్‌ చేసిన రైజింగ్‌ పుణె 20 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులు చేసింది. అజింక్య రహానె (74; 48 బంతుల్లో 8×4, 2×6) టాప్‌ స్కోరర్గా నిలిచాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లి మెరుపులతో బెంగళూరు 19.3 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్' కోహ్లితో పాటు వాట్సన్‌ (36, 13 బంతుల్లో 5×4, 2×6), రాహుల్‌ (38, 35 బంతుల్లో 1×4, 2×6) రాణించారు.
 
మూడు ఓవర్లలో 40 పరుగులు చేయాల్సిన స్థితిలో విరాట్‌ కళ్లు చెదిరేలా ఆడాడు. జంపా బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాదిన అతను.. ఆ తర్వాత మరో ఫోర్‌ కొట్టడంతో బెంగళూరు సాధించాల్సిన లక్ష్యం కరిగిపోయింది. చివరి రెండు ఓవర్లలో 22 పరుగులు చేయాల్సి ఉండగా మరో రెండు సిక్స్‌లు బాదిన విరాట్‌ బెంగళూరుకు విజయాన్ని ఖాయం చేశాడు. అంతేకాదు 56 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.

వెబ్దునియా పై చదవండి