విరాట్ కోహ్లీకి ఖేల్ రత్న అవార్డు.. కేంద్రానికి బీసీసీఐ లేఖ.. రహానేకు అర్జున అవార్డు..?!

మంగళవారం, 3 మే 2016 (13:15 IST)
టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి రాజీవ్ ఖేల్ రత్న అవార్డు రానుంది. కోహ్లీ సహచరుడు అజింక్య రహానేకు కూడా ''అర్జున్'' అవార్డు అందజేసే దిశగా బీసీసీఐ ప్రయత్నాలు మొదలెట్టింది. ఈ మేరకు రాజీవ్ గాంధీ ఖేల్‌ రత్న అవార్డుకు ఎంపిక చేసేందుకు స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీ పేరు ప్రతిపాదిస్తూ బీసీసీఐ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రతి ఏడాది ఉత్తమ క్రీడాకారులకు ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఖేల్‌ రత్న అవార్డు ప్రదానం చేసే విషయం తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో బీసీసీఐ ప్రతిపాదనలకు కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే త్వరలోనే ధోనీ చేతి నుంచి టీమిండియా పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్ బాధ్యతలను కూడా కోహ్లీ తీసుకోనున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ టోర్నీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ టీమ్‌కు కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
 
ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డుతోనూ కోహ్లీ తన సత్తా చూపించాడు. 2014-15లో టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా కోహ్లీ నియమితుడయ్యాడు. శ్రీలకంతో పాటు దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీమిండియాను నాయకత్వ బాధత్యతో విజయ పథంలో నడిపించాడు. ఇటీవల ఐపీఎల్-9లోనూ సెంచరీతో చెలరేగాడు. అన్నీ కలిసొస్తే విరాట్‌కి ఖేల్ రత్న అవార్డు కింద పతకం, సర్టిఫికెట్, ఏడున్నర లక్షల నగదు అందుతుంది. ఇక అర్జున అవార్డుకు జ్ఞాపికతో పాటు సర్టిఫికెట్, రూ.5లక్షలు బహుమతిగా అందిస్తారు.

వెబ్దునియా పై చదవండి