బీసీసీఐ ఆ విషయం చెప్పలేదు.. రోహిత్‌కు ఫుల్ సపోర్ట్: కోహ్లీ
బుధవారం, 15 డిశెంబరు 2021 (14:45 IST)
టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య మనస్పర్ధలు వచ్చాయని వస్తున్న వార్తలపై విరాట్ కోహ్లీ క్లారిటీ ఇచ్చేశాడు. రోహిత్ శర్మతో తనకు ఎలాంటి విభేధాల్లేవని ప్రస్తుత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఇక సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు విశ్రాంతి కోరినట్లు వచ్చిన వార్తల్లో కూడా నిజం లేదని స్పష్టం చేశాడు.
తాను మూడు వన్డేల సిరీస్ ఆడతానని కోహ్లీ పేర్కొన్నాడు. సౌతాఫ్రికా పర్యటనకు బయల్దేరే ముందు కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ.. వన్డే కెప్టెన్సీ మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్‌గా నూటికి నూరు శాతం ఎఫర్ట్ పెట్టానని, టీ20 కెప్టెన్సీ బాధ్యతలను వదులుకుంటానని చెప్పినప్పుడు బీసీసీఐ వద్దని చెప్పలేదన్నాడు.
టీ20 కెప్టెన్సీ వదులుకున్నా వన్డే, టెస్ట్‌ల్లో కొనసాగుతానని చెప్పినట్లు కోహ్లీ వ్యాఖ్యానించాడు. కానీ టీ20 కెప్టెన్సీ వదులుకుంటే వన్డే సారథ్యం నుంచి కూడా తప్పిస్తామని తనకు ఎవరు చెప్పలేదని, ఐసీసీ ట్రోఫీలు గెలవనందుకే ఈ నిర్ణయం తీసుకున్నారేమోనని విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు.
వన్డే కెప్టెన్సీ మార్పు విషయంలో బీసీసీఐ నుంచి తనకు స్పష్టమైన సమాచారం అందలేదని కోహ్లీ చెప్పుకొచ్చాడు. 'టెస్ట్ టీమ్ ఎంపికకు సరిగ్గా గంటన్నర ముందు వన్డే కెప్టెన్సీ మార్పుపై సెలెక్టర్లు తనతో మాట్లాడినట్లు వెల్లడించారు. ఐదుగురు సెలెక్టర్లు వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
అంతే తప్ప తనకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు. వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వాలని తాను కోరినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదు. విశ్రాంతి తాను కోరుకోలేదని సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు అందుబాటులో ఉంటానని కోహ్లీ స్పష్టం చేశాడు.
టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటే వన్డే కెప్టెన్సీ కూడా వదులుకోవాల్సి వస్తుందని అప్పుడు తనకు ఎవరూ చెప్పలేదు. ఐసీసీ ట్రోఫీలు గెలవలేదనే సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకోవచ్చు. ఇక రోహిత్ శర్మకు పూర్తి మద్దతిస్తానని వెల్లడించాడు.
రోహిత్ శర్మ మంచి సత్తా కలిగిన సారథి. వ్యూహాలు రచించడంలో దిట్ట. అతనికి అండగా గొప్ప వ్యక్తయిన రాహుల్ భాయ్ ఉన్నాడు. వన్డే, టీ20ల్లో ఈ ఇద్దరికి 100 శాతం నా మద్దతు ఉంటుందని కోహ్లీ స్పష్టం చేశాడు.