యేడాది తర్వాత బరిలోకి దిగుతున్న విరాట్ కోహ్లీ.. నేడు రెండో టీ20

వరుణ్

ఆదివారం, 14 జనవరి 2024 (09:31 IST)
భారత క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక యేడాది తర్వాత క్రికెట్ మైదానంలోకి దిగుతున్నారు. ప్రస్తుతం ఆప్ఘనిస్థాన్ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా, రెండో టీ20 మ్యాచ్ ఆదివారం జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతున్నాడు. అంటే దాదాపు యేడాది తర్వాత ఆయన టీ20 మ్యాచ్ ఆడనున్నాడు. 
 
మొదటి మ్యాచ్‌లో సునాయాసంగా గెలుపొందిన టీమిండియా.. రెండో టీ20నీ నెగ్గి సిరీస్‌ను చేజిక్కించుకోవాలని భావిస్తోంది. తొలి మ్యాచ్‌కు దూరమైన స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ, యశస్వీ జైస్వాల్‌ రెండో టీ20కి సిద్ధమయ్యారు. అయితే సంవత్సరం విరామం తర్వాత టీ20 జట్టులోకి పునరాగమనం చేస్తున్న విరాట్‌ ఎలా ఆడతాడనేది ఆసక్తికరం. 
 
ఇక అఫ్ఘాన్‌పై సిరీస్‌ విజయం దక్కితే జట్టులోని యువ క్రికెటర్లకు అది ఇచ్చే కిక్కే వేరు. కారణం.. భవిష్యత్‌లో కూడా టీమిండియాలో చోటు కోసం యువ ఆటగాళ్లు ప్రధానంగా పోటీలో ఉండేందుకు సిరీస్‌ గెలుపు తోడ్పడటమే. ఈ ఏడాది పొట్టి వరల్డ్‌ కప్‌ జరగనుండడంతో.. సెలెక్టర్ల దృష్టిలో పడాలంటే జితేశ్‌ శర్మ, వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌ రెండో మ్యాచ్‌లో మరింతగా రాణించాల్సి ఉంటుంది. 
 
జట్టులో చోటుకోసం ఇషాన్‌ కిషన్‌తో పోటీపడుతున్న వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ జితేశ్‌ శర్మకు అఫ్ఘాన్‌తో చివరి రెండు మ్యాచ్‌లు కీలకం కానున్నాయి. లోయరార్డర్‌లో 30కిపైగా స్కోర్లు సాధిస్తున్నా జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకోవాలంటే జితేశ్‌ ఇంకా భారీ స్కోర్లు చేయాలి. నిరుడు వెస్టిండీస్‌పై టీ20ల అరంగేట్రంలో అదరగొట్టిన హైదరాబాదీ తిలక్‌ వర్మ ఆపై అదే స్థాయి ప్రదర్శన చేయలేకపోతున్నాడు. 
 
భారత జట్టు సుదీర్ఘ ప్రణాళికల్లో తానూ ఉండాలంటే 21 ఏళ్ల తిలక్‌ బ్యాట్‌ ఝళిపించాల్సిందే. అయితే విరాట్‌ అందుబాటులో ఉండడంతో.. తుది 11 మందిలో తిలక్‌కు చోటు దక్కుతుందా లేదా అన్నది చూడాలి. మొదటి మ్యాచ్‌లో రెండు వికెట్లతో భళా అనిపించిన లెఫ్టామ్‌ స్పిన్నర్‌ అక్షర్‌ అదే జోరు కొనసాగించి తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని చూస్తున్నాడు. పునరాగమనం చేసిన వాషింగ్టన్‌ సుందర్‌కు ఈ మ్యాచ్‌ ఎంతో కీలకం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు