పుణే జట్టు నుంచి మహీని తొలగించడం ఎంతో హ్యాపీగా ఉంది: సెహ్వాగ్

గురువారం, 23 ఫిబ్రవరి 2017 (16:59 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ఐపీఎల్ టీమ్ పూణే సూపర్ జైంట్స్ సారథ్యం నుంచి తప్పించడంపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. ధోనీ పట్ల పుణే యాజమాన్యం ఓవరాక్షన్ చేసిందని ఇప్పటికే మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అంతేగాకుండా మాజీ క్రికెటర్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం ఇందుకు విరుద్ధంగా ట్విట్టర్లో స్పందించాడు. 
 
ధోనీని కెప్టెన్‌గా తొలగించడం పుణె జట్టు అంతర్గత నిర్ణయమని సెహ్వాగ్ చెప్పాడు. ఈ విషయంపై అనవసరంగా వ్యాఖ్యానించనని.. కానీ భారత జట్టుకు నాయకత్వం వహించిన గొప్ప కెప్టెన్లలో ధోనీ ఒకడని కితాబిచ్చాడు. 
 
ఇంకా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వీరేంద్ర సెహ్వాగ్.. ధోనీని పుణే కెప్టెన్సీ నుంచి తప్పించినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నాడు. ఎందుకంటే? పుణేకు ధోనీ కెప్టెన్‌గా లేకపోవడం ద్వారా వచ్చే సీజన్లోనైనా.. తమ జట్టు (కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌) పుణె టీమ్‌ను ఓడిస్తుందని ఆశిస్తున్నానంటూ సెహ్వాగ్‌ నవ్వుతూ చెప్పాడు. వీరేంద్ర సెహ్వాగ్‌ ప్రస్తుతం పంజాబ్‌ టీమ్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి