"బెస్ట్ 11" ఎవరో మీరు చెప్పండి... మీడియాపై కోహ్లీ గరంగరం

గురువారం, 18 జనవరి 2018 (11:01 IST)
అసలే టెస్ట్ ఓటమి బాధలో ఉన్న భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాపై అసహనం వ్యక్తం చేశాడు. విలేకరులు ఆడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా ఎదురుప్రశ్నలు వేశాడు. ఉపఖండ పిచ్‌ను పోలిన సెంచూరియన్‌లో భారత్‌ ఉత్తమ కూర్పుతో బరిలోకి దిగితే బాగుండేది అన్నప్పుడు.. 'బెస్ట్‌ లెవెన్‌ (ఉత్తమ జట్టు) ఏది?' అని ఎదురు ప్రశ్నించాడు. ఈ మ్యాచ్ మేం గెలిచి ఉంటే ఇదే నా దృష్టిలో బెస్ట్ 11. అయినా బెస్ట్ 11 ఎవరూ అనే విషయాన్ని మేం ఫలితాల ఆధారంగా నిర్ణయించం. మీరు అన్నట్టుగానే మేం బెస్ట్ 11తో ఆడలేదు అనుకుంటే.. పోనీ బెస్ట్ 11 ఎవరో మీరు చెప్పండీ... అందులో మేం అడుతాం' అంటూ చురకలంటించాడు. 
 
అలాగే, ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఎంచుకున్న తుదిజట్టు‌ను కోహ్లీ సమర్థించాడు. 'ఓటమి ఖచ్చితంగా బాధిస్తుంది. కానీ, మనం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడాలి. నువ్వు ఈ మ్యాచ్‌లో విఫలమైతే.. ఆడడానికి పనికిరావని ఒక ఆటగాడికి చెప్పలేం కదా! మేం బెస్ట్‌ లెవెన్‌తో బరిలోకి దిగినప్పుడు భారత్‌లో ఓడిపోలేదా? ఎవరు ఎంపికైనా జట్టు అవసరాలకు తగ్గట్టుగా ఆడాలి. అందువల్లే మాకు ఇంత పెద్ద కోర్‌ టీమ్‌ ఉన్నది. గతంలోనూ మెరుగ్గా కనిపించిన జట్టుతో ఆడినా ఓడిపోయాం' అని కోహ్లీ వ్యాఖ్యానించాడు. 
 
కాగా, సెంచూరియన్ పార్క్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్ళు రెండు ఇన్నింగ్స్‌లలో ఘోరంగా విఫలమయ్యారు. ఫలితంగా మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను మరో టెస్ట్ మిగిలివుండగానే 2-0 తేడాతో దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. రెండో టెస్ట్ మ్యాచ్‌లో సఫారీలు నిర్ధేశించిన 287 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించలేక 135 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు