కాశీబుగ్గ తొక్కిసలాట.. అసలేం జరిగింది.. తొక్కిసలాటకు కారణం ఏంటి?

సెల్వి

శనివారం, 1 నవంబరు 2025 (21:32 IST)
Srikakulam
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ముందుగా ఆలయం లోపలకి ప్రవేశించే ముందు గేట్ల వద్ద భారీగా భక్తులు చేరుకున్నారు. ఈ క్రమంలోనే గేట్ ఓపెన్‌ చేయగా.. మెట్లపై గందరగోళం ఏర్పడింది. దీంతో మెట్లపై ఉన్న భక్తులు ఒకరిపై ఒకరు తోసుకుని కిందపడిపోయారు. అదే సమయంలో కింద పడిపోయిన వారిని తొక్కుకుంటూ ప్రజలు పరుగులు తీశారు. 
 
ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు దాదాపు 9 మంది భక్తులు ప్రాణాలు విడిచారు. అనేక మంది గాయపడ్డారు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. గుడి యాజమాన్యం చేసిన ఒక చిన్న తప్పిదం వల్లే ఈ ఘోరమైన ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 
 
కనీసం పోలీసులకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ఆలయానికి భారీ ఎత్తున భక్తులకు అనుమతినివ్వడమే ఆలయ యాజమాన్యం చేసిన పెద్ద తప్పు అని తెలుస్తోంది. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన జరిగినట్లు తెలియగానే స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి హృదయ విదారక దృశ్యాలు చూసి ఆమె కంటతడి పెట్టారు. 
 
అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించారు. అలాగే కాశీబుగ్గలో ఒక ప్రైవేటు వ్యక్తి వెంకటేశ్వర ఆలయం నిర్మించారు. కార్తీక మాసం ఏకాదశి కావడంతో, ఎక్కువ మంది భక్తులు అక్కడకు చేరుకున్నారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. నిర్వాహకులు కనీసం పోలీసులకు గానీ, అధికారులకు గానీ సమాచారం ఇవ్వలేదని చంద్రబాబు తెలిపారు. తొక్కిసలాట జరిగి అమాయకులు చనిపోవడం బాధాకరం. 
 
చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తున్నానని వెల్లడించారు. ఒక్క ప్రాణం కూడా పోకూడదని ప్రభుత్వం కృషి చేస్తుండగా, ప్రైవేటు కార్యక్రమాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుని అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరం. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు వెల్లడించారు. 
 
మరోవైపు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ దుర్ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విచారకరం. మీడియాలో సమాచారం మేరకు 10 మంది మరణించారని తెలుస్తోంది. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలి. సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని మా పార్టీకి చెందిన నాయకులను ఆదేశించానని తెలిపారు. 
 
ఇకపోతే.. శ్రీకాకుళం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం పూర్తిగా ఒడిశా రాజ కుటుంబం నిర్వహణలో ఉంది. ఇది ఒక ప్రైవేట్ దేవాలయం. ఈ ఏడాది మే నెలలోనే ప్రారంభమైంది. స్వయంగా ఆలయ ధర్మకర్త హరిముకుంద్ పాండా, తాము అధికారులకు గానీ, పోలీసులకు గానీ ముందస్తు సమాచారం ఇవ్వలేదని, అసలు ఇంత మంది వస్తారని తమకే తెలియదని చెప్పారు. ఆలయ ధర్మకర్తలే ఇంత మంది ఎప్పుడూ రాలేదు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు