మొంథా తుఫాను ప్రభావం తగ్గకముందే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. రానున్న రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు పడనున్నట్లు తెలిపింది.
ఏపీలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉంది. తెలంగాణలో ఏర్పడిన మోంథా తుఫాను ప్రభావం, తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం కారణంగా వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. తెలంగాణపై ప్రభావం చూపుతున్న అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. నదీ పరివాహక ప్రాంతాలు, వాగులు, వంకల దగ్గర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.