భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్. కేన్సర్ బారినపడి తిరిగి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఈ క్రమంలో జాతీయ జట్టుకు దూరమయ్యాడు. అయితే, తాను మళ్లీ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తానంటూ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు.
భారత క్రికెట్‌లో ఒకప్పుడు వన్డే పోటీల్లో యువరాజ్ సింగ్ ఓ వెలుగు వెలిగాడు. కానీ, దురదృష్టవశాత్తూ అతని ప్రతిభకు దక్కాల్సిన స్థాయిలో గుర్తింపు దక్కలేదనే చెప్పాలి. జట్టులో రాజకీయాలు, యువీని ప్రతిసారీ వెక్కిరిస్తూనే వచ్చాయి.
బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లోనే కాదు, బౌలింగ్‌లోనూ సత్తా చాటాడు. ధోనీ నేతృత్వంలో టీమిండియా వన్డే వరల్డ్ కప్ సొంతం చేసుకున్నా, టీ20 వరల్డ్ కప్ దక్కించుకున్నా.. అందులో యువీ పాత్ర చాలా చాలా ఎక్కువన్నది నిర్వివాదాంశం.
దురదృష్టవశాత్తూ వన్డే వరల్డ్ కప్ తర్వాత యువీ, క్యాన్సర్ బారిన పడటం.. అతని కెరీర్‌పై తీవ్ర ప్రభావమే చూపింది. క్యాన్సర్‌ని జయించినా, తిరిగి మైదానంలో సత్తా చాటలేకపోయాడు. అవకాశాలు తగ్గిపోయి, అవమానాలు ఎదుర్కొని.. చివరికి జట్టుకి దూరమయ్యాడు.
మళ్లీ ఇన్నేళ్ళకు ఇప్పుడు తిరిగి టీమిండియా తరపున ఆడాలనే కసితో వున్నాడట. తిరిగి జట్టులోకి వచ్చేందుకోసం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో యువీ మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే, 38 ఏళ్ళ యువీ మళ్ళీ మైదానంలోకి టీమిండియా జెర్సీతో అడుగుపెట్టగలడా.? పెట్టినా, మునుపటి జోష్ యువీ ఆటలో చూడగలమా.? అనేది భవిష్యత్ నిర్ణయించాల్సివుంది.