ఐటీ ఉచ్చులో షార్ట్‌కట్ కోటీశ్వరుడు... ఐపీఎల్ మోడీ!!

PTI
నాలుగేళ్ల క్రితం వరకూ సామాన్యుడిలా జీవితాన్ని గడిపిన లలిత్ మోడీ నేడు వ్యక్తిగతంగా ఓ ప్రైవేట్ జెట్ విమానాన్ని ఏర్పరుచుకునే స్థాయికి ఎదిగిపోయాడు. అంతేకాదు.. దేశంలో కొంతమంది కుబేరులకు మాత్రమే పొందగలిగే సకల సదుపాయాలు మోడీ అనుభవించగలుగుతున్నాడు. కేవలం మూడంటే మూడేళ్లలో ఇదంతా సాధ్యమైంది... అదెలా..?!! వివరాల్లోకి వెళితే...

స్వల్పకాలంలోనే మోడీ కోటీశ్వరుని అవతారం ఎత్తడం వెనుక మూడోకంటికి తెలియని ఐపీఎల్ రహస్య ఒప్పందాలు, మరెన్నో డీల్స్ ఉన్నట్లు సమాచారం. అచిరకాలంలో కోట్లకు పడగలెత్తిన మోడీ ధనార్జన ఎలా సాగిందన్నదానిపై ఐటీ శాఖ ఆరు నెలల క్రితమే దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.

రాజస్థాన్‌లో భూములకు సంబంధించిన డీల్స్‌తో ప్రారంభమైన మోడీ చేతివాటం అనతికాలంలో కోట్లను రాబట్టగలిగింది. ఈ వ్యవహారంలో ఎన్నో కంపెనీలను బుట్టలో వేసిన మోడీ అత్యంత చాకచక్యంగా కోట్లకొద్దీ డబ్బు సంచులను చేతులు మార్చినట్లు తెలుస్తోంది. ఇక ఐపీఎల్ టోర్నమెంట్ విషయంలోకి వచ్చేసరికి మోడీ తన రూట్ ప్లాన్ మార్చి వివిధ దారుల్లో డబ్బును ఆర్జించినట్లు ఐటీ శాఖ విచారణలో వెల్లడైనట్లు సమాచారం.

మోడీకి సంబంధించిన ఆదాయపు వివరాలను కనుగొనేందుకు ఐటీ శాఖ, ఆయనకు సంబంధించిన ఇ- మెయిల్ ఎకౌంట్, సెల్ ఫోన్లలో జరిపిన మంతనాలు, విదేశాల్లో ఆయన కార్యకలాపాలతోపాటు గత నాలుగేళ్ల కాలంలో భారతదేశంలో ఎవరెవరితో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నారనే దానిపై పూర్తిస్థాయి వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఈ విచారణలో ఐపీఎల్ మ్యాచ్‌లలోకి నల్లధనం ప్రవాహంలా వచ్చి చేరడంతోపాటు ఐపీఎల్ మ్యాచ్‌లపై కోట్లకొద్దీ బెట్టింగ్ చోటుచేసుకుందని సమాచారం.

ఇలా చెప్పుకుంటూ పోతే ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ అనుసరించిన మార్గం అంతా వంకరటింకరగా సాగుతూ షార్ట్‌కట్‌లో కోట్ల రూపాయల ఆర్జనే లక్ష్యంగా దూసుక పోయిందని తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి