ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగా? నో ఛాన్స్: కొట్టిపారేసిన ఐసీసీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటూ వచ్చిన వార్తలను అంతర్జాతీయ క్రికెట్ బోర్డు (ఐసీసీ) తోసిపుచ్చింది. ఐపీఎల్‌లో 29మంది క్రికెటర్లు మ్యాచ్ ఫిక్సింగ్ లేదా స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని వస్తున్న వార్తలను ఐసీసీ సీఈవో హారూన్ లోర్గాత్ తోసిపుచ్చారు.
అలాగే మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడ్డారని తెలిసిన 29 మంది వద్ద ఐసీసీకి చెందిన అవినీతి నిరోధక విభాగం దర్యాప్తు చేస్తుందంటూ వచ్చిన వార్తలను లోర్గాత్ ఖండించారు.
ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్‌పై వచ్చిన వార్తలను గమనించామని, ఐసీసీ సభ్యత్వ దేశాల బోర్డులకు విడివిడిగా పంపిన ఇ-మెయిల్‌లో లోర్గాత్ పేర్కొన్నారు. కానీ అలాంటి జాబితా ఏదీ లేదని, మీడియా ఎలాంటి ఆధారాలు లేకుండానే సమాచారం కోసం సాగించే వేటలో ఇదొక మార్గం తప్ప మరోటి కాదని స్పష్టం చేశారు. ఒక వేళ ఏ ఆటగాడిపైనైనా దర్యాప్తు జరుపుతున్నట్లే ఆ విషయాన్ని ఐసీసీ సభ్య దేశాల బోర్డుకు తెలియజేస్తుందని కూడా లోర్గాత్ తెలిపారు.