ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్ సెమీఫైనల్ మ్యాచ్‌ల వేదికను బెంగళూరు నుంచి ముంబైకి మార్పిడి చేయొద్దని కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప కోరారు. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో జరిగిన పేలుళ్ల సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని యడ్యూరప్ప తెలిపారు.
ఇందుకోసం స్టేడియంలో కట్టుదిట్టమైన భద్రతను మరింత పటిష్టం చేస్తామని యడ్యూరప్ప ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. విదేశీ ఆటగాళ్లతో పాటు స్టేడియం పరిధిలో బందోబస్తును పటిష్టం చేస్తామని ఐపీఎల్ యాజమాన్యానికి ముఖ్యమంత్రి తెలియజేశారు.
ఇదిలా ఉంటే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన 52వ లీగ్ మ్యాచ్‌కు ఒక గంట సేపు ముందు చిన్న స్వామి స్టేడియంలో జంట పేలుళ్లు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ పేలుళ్లలో పోలీసులతో పాటు 15 మంది గాయాలకు గురైయ్యారు. దీన్ని అనుసరించి స్టేడియం సమీప ప్రాంతాల్లో పోలీసులు తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో భాగంగా.. అమ్మోనియం నైట్రేట్‌తో కూడిన రెండు బాంబులను నిర్వీర్యం చేశారు.
దీంతో భద్రతా కారణాల దృష్ట్యా ఈ నెల 21, 22 తేదీల్లో జరగనున్న ఐపీఎల్ సెమీఫైనల్ మ్యాచ్‌లను బెంగళూరు నుంచి ముంబైకి తరలిస్తున్నట్లు ఐపీఎల్ యాజమాన్యం ప్రకటించిన సంగతి తెలిసిందే.