కేకేఆర్-ముంబైల మధ్య ఐపీఎల్ చివరి లీగ్ మ్యాచ్ నేడే!

FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌‌లో భాగంగా చివరి లీగ్ మ్యాచ్‌కు కోల్‌కతా వేదిక కానుంది. సచిన్ టెండూల్కర్ సేన ముంబై ఇండియన్స్- బెంగాల్ దాదా కెప్టెన్సీ సారథ్యంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ల మధ్య జరిగే చివరి 56వ లీగ్ మ్యాచ్‌ సోమవారం జరుగనుంది.

ఇప్పటికే 20 పాయింట్ల ఐపీఎల్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. కానీ సెమీఫైనల్ అవకాశాలను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు చేజార్చుకుంది. దీంతో అంతగా ప్రాధాన్యత లేని ఈ చివరి లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఊరట కోసం ముంబైపై నెగ్గే దిశగా బరిలోకి దిగనుంది.

కానీ.. ఈ మ్యాచ్‌లోనూ గెలుపును నమోదు చేసుకుని నెట్ రన్‌‍రేటును పెంచుకోవాలని ముంబై ఇండియన్స్ భావిస్తోంది. రన్ రేటును పెంచుకోవడం ద్వారా ముంబై ఇండియన్స్ ఐపీఎల్ అగ్రస్థానంలోనే కొనసాగుతుంది.

అయితే 48వ ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ సేన చెన్నై సూపర్ కింగ్స్‌తో నెగ్గిన ఊపుతో ఉన్న కోల్‌కతా నైట్‌‌రైడర్స్, పరువు కాపాడుకునేందుకు ముంబైపై నెగ్గాలని తహతహలాడుతోంది. కాగా.. సచిన్ టెండూల్కర్, అంబటి రాయుడు వంటి మేటి బ్యాట్స్‌మెన్ల ఆటతీరుతో కేకేఆర్‌కు చివరి మ్యాచ్‌లోనూ ఓటమి తప్పదని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. మరి ఐపీఎల్ చివరి లీగ్ మ్యాచ్‌ను సచిన్ సేన కైవసం చేసుకుంటుందా? లేదా గంగూలీ సేన సొంతం చేసుకుంటుందా? వేచి చూడాల్సిందే...!

వెబ్దునియా పై చదవండి