చివరి టెస్టు డ్రా... సిరీస్‌ విండీస్‌ కైవసం

ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ జట్ల నడుమ జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్ అనూహ్యమైన మలుపులు తిరుగుతూ చివరకు డ్రాగా ముగిసింది. దీంతో ఐదు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ను విండీస్‌ 1-0 తేడాతో కైవసం చేసుకుంది.

ఫోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్ పార్క్ ఓవెల్‌లో జరిగిన మ్యాచ్ చివరి రోజు 240 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన గేల్ సేన ఆట ముగిసే సమయానికి 114 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది. చివరకు అతి కష్టంమీద టెస్ట్‌ను డ్రాగా ముగించింది. ఫలితంగా... విండీస్ 11 సంవత్సరాల తరువాత ఇంగ్లండపై టెస్ట్ సిరీస్‌ను 1-0 ఆధిక్యంతో గెలుచుకుంది.

2000 సంవత్సరం తరువాత తొలిసారిగా విజ్డన్ ట్రోఫీని విండీస్ తిరిగీ దక్కించుకోగా... ఇలా చేతులదాకా వచ్చిన విజయం చేజారడం ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌కు రెండోసారి కావడం గమనించదగ్గ అంశం. మూడో టెస్టులోనూ విండీస్ టెయిలెండర్లు వీరోచితంగా పోరాడి జట్టును విజయపథంలో నడిపించారు.

కాగా, తొలి, రెండో ఇన్నింగ్స్‌లో వరుసగా సెంచరీ (131 నాటౌట్), హాఫ్ సెంచరీ (61) పూర్తి చేసిన ఇంగ్లండ్ వికెట్ కీపర్ ప్రయర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అలాగే, విండీస్ బ్యాట్స్‌మెన్ శర్వాణ్‌ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు.

వెబ్దునియా పై చదవండి