టెస్టుల్లోనూ ఇదే ఊపుతో రాణిస్తాం : మోల్స్

టీం ఇండియాతో జరిగిన ఐదో వన్డేలో విజయం తమ జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపిందనీ, ఇదే ఊపును రాబోయే టెస్ట్ మ్యాచ్‌లలో కూడా కొనసాగిస్తామని... న్యూజిలాండ్ కోచ్ ఆండీ మోల్స్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఈ విషయమై మోల్స్ మీడియాతో మాట్లాడుతూ... టీం ఇండియా మంచి జట్టేననీ.. అయితే వారికి తాము ఏ మాత్రం తీసిపోలేదని అన్నారు. వారు సిరీస్ గెలిచామని చెప్పవచ్చుగానీ... తమ వరకైతే రెండు ట్వంటీ20 మ్యాచ్‌లతో కలిపి ఆరు మ్యాచ్‌లు ఆడగా, అందులో భారత్‌తో పాటు సమానంగా మూడు మ్యాచ్‌లు తాము కూడా గెలిచామని సమర్థించుకున్నాడు.

టెస్ట్ మ్యాచ్‌లను తమ తాజా విజయంతో ఆరంభించబోతున్నామని, ఇదే ఊపును ఇకపై కొనసాగించి రాణిస్తామని మోల్స్ ధీమా వ్యక్తం చేశాడు. ప్రారంభంలోనే వికెట్లు సాధించినట్లయితే, భారత్‌పై ఒత్తిడి పెరుగుతుందని, అలాంటప్పుడు తమ పని సులువు అవుతుందని ఆయన విశ్లేషించాడు.

అయితే... వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్ లాంటి ఆటగాళ్ల కలయికతో ధోనీ సేన సమతూకంగా ఉందని మోల్స్ కితాబిచ్చాడు. అయినప్పటికీ వారికి తగినట్లుగా తాము కూడా రాణిస్తామని, అయితే కివీస్ ఆటగాళ్లు మరింత క్రమశిక్షణతో పాటు ఓర్పుగా ఆడాల్సి ఉంటుందని సూచించాడు. కాగా, పచ్చిక ఉన్న వికెట్‌ను తాము కోరుకోవటం లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశాడు.

వెబ్దునియా పై చదవండి