డెక్కన్ ఛార్జర్స్‌ టీమ్ స్పాన్సర్‌గా ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్!

FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జట్టు డెక్కన్ చార్జర్స్‌కు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. డెక్కన్ చార్జర్స్ జట్టు కో-ఓనర్ గాయత్రీ రెడ్డి, ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ సంస్థ వైస్-ప్రెసిడెంట్ (ఇండో-నేపాల్) ఆర్హన్ అబ్బాస్ హైదరాబాద్‌లో యుక్తంగా విలేఖర్ల సమావేశాన్ని ఏర్పాటుచేసి ఈ విషయాన్ని ప్రకటించారు.

ఏప్రిల్ 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఐపిఎల్ ఐదో ఎడిషన్ నుంచి మొదలుకొని మూడేళ్ల కాలానికి ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు వెల్లడించారు. విమానయాన రంగంలో విశిష్టమైన సేవలు అందిస్తూ అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ సంస్థ తమ జట్టుకు స్పాన్సరర్‌గా వ్యవహరించనుండటం సంతోషాన్నిస్తుందని గాయత్రీ రెడ్డి అన్నారు.

నూతన స్పాన్సరర్‌తో పాటు అంతర్జాతీయ మేటి ఆటగాళ్లు, యువ క్రికెటర్లతో సరికొత్త శోభను సంతరించుకున్న డెక్కన్ చార్జర్స్ జట్టు ఐపిఎల్-5లో విజయభేరి మోగించి మరోసారి టైటిల్ విజేతగా నిలిచేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తోందని గాయత్రీ రెడ్డి చెప్పారు.

వెబ్దునియా పై చదవండి