హామిల్టన్‌లోని సెడెన్ పార్కులో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ రాణిస్తున్నారు. తొలి రోజు ఓవర్ నైట్ స్కోరు 29 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ తొలి వికెట్‌ను 37 పరుగుల వద్ద కోల్పోయింది. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (24) లేని పరుగు కోసం యత్నించి రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన రాహుల్ ద్రావిడ్ నింపాదిగా ఆడుతూ మరో వికెట్ పడకుండా అడ్డుకున్నాడు.
ఓపెనర్ గంభీర్ (72)తో కలిసి జట్టు స్కోరును పెంచాడు. ఆ క్రమంలో గంభీర్ వికెట్ జట్టు స్కోరు 142 పరుగుల వద్ద పడిపోయింది. అలాగే, రాహుల్ ద్రావిడ్ కూడా అర్థ సెంచరీతో రాణించాడు. అయితే, వ్యక్తిగత స్కోరు 66 పరుగుల వద్ద ఒబ్రిన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మరో మారు రాణించి, జట్టు స్కోరును పెంచారు.
ఈ క్రమంలో 30 పరుగులు చేసిన లక్ష్మణ్ జట్టు స్కోరు 238 వద్ద అవుట్ అయ్యాడు. అయితే మరో ఎండ్‌లో ఉన్న సచిన్ టెస్టుల్లో 52వ అర్థ సెంచరీని పూర్తి చేసుకుని క్రీజ్‌లో నిలదొక్కుకున్నాడు. ప్రస్తుతం సచిన్ (70), యువరాజ్ సింగ్ (8) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కివీస్ బౌలర్లలో మార్టిన్ రెండు, ఒబ్రిన్‌కు ఒక వికెట్ దక్కింది.