తొలి టెస్ట్: కివీస్ 279 ఆలౌట్.. భారత్ 29/0

హామిల్టన్‌లో న్యూజిలాండ్‌తో బుధవారం నుంచి ఆరంభమైన తొలి టెస్ట్‌ తొలి రోజన భారత్ పైచేయి సాధించింది. భారత పేసర్ ఇషాంత్‌శర్మ, జహీర్ ఖాన్‌, మునాఫ్ పటేల్, హర్భజన్ సింగ్‌లు రాణించడంతో కివీస్ జట్టు 279 పరుగలకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన టీమ్ ఇండియా వికెట్ నష్ట పోకుండా 29 పరుగులు చేసింది.

కివీస్ బ్యాట్స్‌మెన్‌లో రైడర్ (102), కెప్టెన్ వెటోరీ (118)లు సెంచరీలు సాధించగా మిగిలిన బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫలమయ్యారు. భారత్ తరపున జహీర్‌ఖాన్ రెండు వికెట్లు సాధించగా, హర్భజన్ ఒక్క వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం తన తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ తొలిరోజు ఆటముగిసే సమయానికి వికెట్లేమీ కోల్పోకుండా 29 పరుగులు చేసింది. ఓపెనర్లు సెహ్వాగ్ (22), గంభీర్ (6)లు క్రీజులో ఉన్నారు.

అంతకుముందు టాస్ గెలిచిన భారత్ కివీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. పేస్‌కు అనుకూలించిన సెడెన్ పార్క్ మైదానంలో భారత్ బౌలర్లు విజృంభించారు. దీంతో కివీస్ ఒకానొక దశలో 60 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. ఈ దశలో రైడర్‌, వెటోరీలు బ్యాట్‌కు పనిచెప్పడంతో న్యూజిలాండ్ స్కోరు పరుగులు పెట్టింది.

తొలుత ఆరు వికెట్లను వేగంగా పడగొట్టిన భారత బౌలర్లు రైడర్, వెటోరీల భాగస్వామ్యాన్ని వీడదీయడంలో మాత్రం విఫలమయ్యారు. దీంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది.

వెబ్దునియా పై చదవండి