స్వదేశంలో భారత్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 279 పరుగలకు ఆలౌట్ అయింది. హామిల్టన్‌లోని సెడన్ పార్కులో మంగళవారం టీం ఇండియాతో ప్రారంభమైన తొలి టెస్ట్ మ్యాచ్‌లో టాస్ ఓడిన కివీస్ జట్టు తొలుత బ్యాటింగ్ చేపట్టింది. ఓ దశలో 60 పరుగులకే కీలకమైన ఆరు వికెట్లు చేజార్చుకొని పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును కెప్టెన్ డేనియల్ వెట్టోరి, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రైడర్‌లు సెంచరీలతో ఆదుకున్నారు. దీంతో తేరుకున్న కివీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో గౌరవప్రదమైన స్కోరు చేసింది.
రైడర్ (102), విటోరీ (118) రాణింపుతో న్యుజిలాండ్ జట్టు ఘోర పరాభవాన్ని తప్పించుకోగలిగింది. ప్రత్యర్థి టాప్‌ఆర్డర్, మిడిల్‌ఆర్డర్ వెన్నువిరిచిన టీం ఇండియా బౌలర్లు ఆ తరువాత రైడర్, విటోరీల జోరుకు కళ్లెం వేయలేకపోయారు. వీరిద్దరి భాగస్వామ్యాన్ని విడదీయడంలో బౌలర్లు విఫలం అవడంతో కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 279 పరుగులు చేసింది.
రైడర్, విటోరీ మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ పెద్దగా స్కోరు చేయలేదు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ నాలుగు వికెట్లు పడగొట్టగా, జహీర్ ఖాన్ రెండు, మునాఫ్ పటేల్ మూడు, హర్భజన్ సింగ్ ఒక వికెట్ దక్కించుకున్నారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ మూడు ఓవర్లు ఎదుర్కొని వికెట్లేమీ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. సెహ్వాగ్ (5), గంభీర్ (5) క్రీజ్‌లో ఉన్నారు.